వనపర్తి జిల్లా నాగవరంలో మంగళవారం నాడు టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, బుధవారం నాడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నానని, నిరుద్యోగులంతా ఉదయం 10 గంటలకు టీవీ చూడాలని కోరారు. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారం అయిందో రేపు అసెంబ్లీలో చెప్పబోతున్నానని, తెలంగాణ కోసం ఎలా ఉద్యమం చేపట్టి కొట్లాడామో, దేశం కోసం కూడా అలాగే పోరాడదామని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్‌పై మాట్లాడనున్న సందర్భంగా నిరుద్యోగులకు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. ఆయన ఏం ప్రకటన చేయబోతున్నారనే దానిపై నిరుద్యోగులతో పాటు తెలంగాణ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
సీఎం కేసీఆర్ వనపర్తిపై వరాల జల్లు కురిపించారు. సీఎం సహాయనిధి నుంచి వనపర్తి పట్టణానికి రూ.కోటీ, మున్సిపాలిటీలకు రూ.50 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నామని, అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందందటూ తెలిపారు. ఎన్నో సమస్యలను అధిగమించామని.. ఇది ప్రజలందరి శ్రమ ఫలితమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా అవుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదని.. ఇప్పుడు వనపర్తి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వెల్లడించారు. గతంలో పాలమూరు జిల్లాలో పరిస్థితులు చూస్తే కన్నీళ్లు వచ్చేవని అన్నారు. తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క వైద్య కళాశాల కూడా లేదని, తెలంగాణ వచ్చాక ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. పాలమూరు జిల్లా పాలుగారుతోందని, తాను సంతోషం పట్టలేక పొలాల్లోకి వెళ్లి చూశానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలంతా తిరిగి వచ్చారని తెలిపారు. వనపర్తి జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
తెలంగాణలో కొత్త ఉద్యోగాల కోసం మూడు నుంచి నాలుగు వేల కోట్లు కేటాయించే అవకాశముందని సమచారం. నెల రోజుల్లో నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ విషయమై ఈరోజు సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని అంటున్నారు.