Telugu States

శ్రీలంకలో డబ్బులు పంచుతున్న తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త.. అరెస్ట్

తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త శ్రీలంకలో అరెస్ట్ అయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి ఇటీవల శ్రీలంకకు వెళ్లారు. శ్రీలంక ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉండడంతో రవీందర్ రెడ్డి మానవతా ధృక్పథంతో అక్కడి ప్రజలకు డబ్బులు పంచారు. దీన్ని గమనించిన శ్రీలంక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ. 5 లక్షలు పంచుతుండగా ఆయనను పట్టుకున్నారు. ఆ తర్వాత విచారణ జరిపి వదిలేశారు. ఈ ఘటనపై రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తాను ప్రతి నెల శ్రీలంక వెళ్తానని.. అక్కడ ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఆహారం, డబ్బులు, ఇతర వస్తువులు అందిస్తానని తెలిపారు. నెలలో 9 నుంచి 21 రోజుల పాటు అక్కడే ఉంటాను’ అని చెప్పారు. మన కరెన్సీని శ్రీలంక కరెన్సీలోకి మార్చి ప్రజలకు డబ్బులు పంచుతుండగా పోలీసులు తనను అరెస్ట్ చేశారని చెప్పారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నానని వెల్లడించారు. శ్రీలంక చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్న సంగతి తెలిసిందే..!

Related Articles

Back to top button