Telugu States

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ‘ఆర్ఆర్ఆర్’.. వైరల్ పోస్టులు

హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘనవిజయంతో బీజేపీ శ్రేణుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. నవంబరు 2న ప్రగతి భవన్ వద్ద ‘ట్రిపుల్ ఆర్ సినిమా’ చూపిస్తానంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే స్టిక్కర్ అంటించిన వాహనంతో బీజేపీ కార్యకర్తలు ప్రగతి భవన్ వద్దకు వచ్చారు. “ఆర్ఆర్ఆర్ సినిమా చూడు కేసీఆర్” అంటూ నినాదాలు చేశారు. ఆ వాహనంపై రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు బండి సంజయ్, రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్ ల ఫొటోలు అంటించి ఉన్నాయి. ప్రగతి భవన్ వద్ద బీజేపీ కార్యకర్తలను పోలీసులు అక్కడ్నించి పంపించివేశారు.

ఇంతకూ ఈ ఆర్ఆర్ఆర్ ఏమిటా అనే విషయం కొందరికి తెలియకపోవచ్చు. తెలంగాణలో హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలకు ముందు బీజేపీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలుండగా తాజాగా మరో ఎమ్మెల్యే అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లలో మొదటి అక్షరం‘ఆర్​’తో మొదలు కావడంతో ట్రిపుల్ఆర్ అనే స్లోగన్ తెరమీదికొచ్చింది. డైరెక్టర్​ రాజమౌళి డైరెక్షన్​లో రాంచరణ్, రామారావు(ఎన్​టీఆర్) హీరోలుగా ‘ఆర్​ఆర్​ఆర్’ అనే సినిమా తీస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఇదే కోవలోకి రావడంతో ఆర్​ఆర్​ఆర్​ స్లోగన్ పాపులర్ అయింది. ప్రస్తుతం ఈటల గెలుపుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బీజేపీ తరఫున జనరల్ ఎన్నికల్లోనే గోషామహల్ నుంచి రాజాసింగ్ విజయం సాధించగా, గతేడాది దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసిన రఘునందన్ రావు గెలుపొందారు. తాజాగా హుజూరాబాద్ ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం సాధించారు.

దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా అసెంబ్లీలో అప్పటికే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు‌‌కు తోడుగా రఘునందన్‌‌రావు గెలిస్తే సీఎం కేసీఆర్‌‌కు అసెంబ్లీలో ట్రిపుల్ఆర్(ఆర్ఆర్​ఆర్) సినిమా చూపిస్తామని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అనుకున్నట్టే అప్పట్లో రఘునందన్​రావు విజయం సాధించారు. అయితే ఆ తర్వాత రామచంద్రరావు ఎమ్మెల్సీగా పదవీకాలం ముగియడం, ఆ తర్వాతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో మళ్లీ బీజేపీ డబుల్​ఆర్ ​(రాజాసింగ్, రఘునందన్​రావు)గా మారింది. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ బరిలో నిలవడంతో, మరోసారి ట్రిపుల్ఆర్‌‌ స్లోగన్ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం రాజేందర్ గెలుపుతో బీజేపీ ‘ఆర్ఆర్​ఆర్’ టీమ్ ఫామ్ అయినట్టయింది.

Related Articles

Back to top button