More

    మునుగోడు.. హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ

    మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఓటర్‌ జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. కొత్తగా ఓట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య రెండు నెలల్లోనే పాతిక వేలు దాటడంతో అనుమానాలను వ్యక్తం చేస్తూ.. విచారణ జరపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. 7 నెలల కాలంలో 1,474 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా, ఇప్పుడు 6 నెలల్లోనే పెద్ద మొత్తంలో 24,781 దరఖాస్తు రావడం వెనుక టీఆర్‌ఎస్‌ హస్తం ఉందని ఆరోపించింది.

    జూలై 31 నాటికి ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగానే మునుగోడు ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీజేపీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. లంచ్‌ మోషన్‌లో పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి కోరారు. అయితే అత్యవసరంగా విచారణ చేపట్టలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘం కొత్త దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉందని, ఓటర్ల జాబితాను ఖరారు చేయనున్నారని రచనారెడ్డి తెలపడంతో.. ఈ నెల 13న విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. ఫారం 6, 7, 8, 8ఏ విభాగాలకు చెందిన 25 వేల దరఖాస్తులను ఎలాంటి పరిశీలన లేకుండానే ఎన్నికల సంఘం ఆమోదించిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఎన్నికల సంఘం చర్య రాజ్యాంగానికి, ప్రజాప్రాతినిధ్య చట్టం – 1950కి విరుద్ధమని ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూలై 31 వరకు 7 నెలల్లో మునుగోడు, చండూరు మండలాల్లో 1,474 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని అధికారులు ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇచ్చారని.. మిగతా మండలాలను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య సుమ రు 2 వేల వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. కానీ ఈ నెల 10న జిల్లా ఎన్నికల అధికారి నిర్వహించిన అఖిలపక్ష భేటీలో కొత్తగా ఫారం 6 దరఖాస్తులే 24,781 వచ్చినట్లు అధికారులు వెల్లడించారని.. కేవలం 2 నెలల 10 రోజుల్లో ఇంత భారీగా దరఖాస్తులు రావడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని బీజేపీ నేతలు అంటున్నారు.

    Trending Stories

    Related Stories