More

    కేసీఆర్ పై దేశద్రోహం కేసు వేయనున్న బీజేపీ

    బీజేపీ లీగల్‌సెల్‌ ప్రతినిధులతో తెలంగాణబీజేపీ అధ్య‌క్షుడు బండి సంజయ్ హైద‌రాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, లీగల్‌సెల్‌ ప్రతినిధులు, నాయకులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ ఇటీవ‌ల తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇప్పుడు న్యాయపరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై సమీక్షిస్తున్నారు. బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మారుస్తానని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై న్యాయపరంగా ఎలా వ్యవహరించాలన్నదానిపై చర్చించామ‌ని చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలను తాము తేలిగ్గా తీసుకోబోమ‌ని బండి సంజయ్ అన్నారు.

    ఈ స‌మావేశం అనంతరం మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేసీఆర్‌పై దేశద్రోహం కేసు వేయాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రోజుకో గంట పాటు కోర్టుల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాల‌ని తాము నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ప‌లువ‌రు బీజేపీ నేత‌ల‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. దేశ‌ రాజ్యాంగానికి సంకెళ్లు వేయాలని టీఆర్ఎస్ భావిస్తోందని ఆయ‌న చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరసనలో పాల్గొంటే ఆందోళ‌న‌కారుల‌పై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నార‌ని.. మోదీని, నిర్మలా సీతారామన్‌ను వ్యక్తిగతంగా అవమానించేలా కేసీఆర్ మాట్లాడటం దుర్మార్గమన్నారు. కేసీఆర్ రాజకీయ దురుద్దేశంతోనే రాజ్యాంగాన్ని తిరిగి రాయాలాంటూ అంబేద్కర్‌ను అవమానించారని ఆయ‌న అన్నారు.

    Trending Stories

    Related Stories