బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి పరిచయం ఉన్న ఓ స్వామిజీ తనకు చెప్పారని.. నల్ల పిల్లితో ఫాంహౌస్ లో క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆయన తనతో చెప్పారన్నారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు బాగుండాలనే క్షుద్ర పూజలు చేస్తున్నారని అన్నారు.
దుబ్బాక, హుజురాబాద్ నియోజకవర్గాల్లో కూడా క్షుద్ర పూజలు చేశారు.. అయినా రెండో చోట్ల టీఆర్ఎస్ కు ఘోర ఓటమి తప్పలేదని బండి సంజయ్ తెలిపారు. జీహెచ్ఎంసీలో కూడా బీజేపీకి 48 స్థానాలొచ్చాయన్నారు. మునుగోడులో గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఇక్కడ కూడా టీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ తలకిందులైనా ఆయన పూజలు ఫలించవన్నారు. కేసీఆర్ చేస్తున్న తాంత్రిక పూజల వల్ల ఎన్నో అనర్థాలు జరిగే అవకాశముందన్నారు. టీఆర్ఎస్ తో ఎన్నికల బరిలోకి దిగితే ఘోర ఓటమి తప్పదని తాంత్రికుడు చెప్పడంతోనే కేసీఆర్.. తన పార్టీని బీఆర్ఎస్ గా మార్చారని బండి సంజయ్ అన్నారు. సెక్రటేరియట్ ను కూల్చింది కూడా అందుకే అన్నారు. ఫాంహౌస్ లో చేసిన తాంత్రిక పూజలకు సంబంధించిన అస్తికలను కలపడానికి కాళేశ్వరానికి కుటుంబ సమేతంగా వెళ్లారని ఆరోపించారు. కేసీఆర్ ఆలోచన విధానం,ఆయన వ్యవహార శైలిలో మార్పు రావాలని బండి సంజయ్ స్పష్టం చేశారు.