తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల యాత్రను పూర్తి చేసిన బండి సంజయ్.. ఈ నెల 15 నుంచి ఐదో విడత పాదయాత్రను చేపట్టాలని భావించారు. బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర బైంసా నుంచి కరీంనగర్ వరకు కొనసాగుతుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర వాయిదా పడింది. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బండి సంజయ్ తన ఐదో విడత పాదయాత్ర వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు ఎన్నికల హడావుడి పూర్తయ్యాక బండి సంజయ్ తిరిగి పాదయాత్రను కొనసాగిస్తారని బీజేపీ నాయకులు తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈనెల 7న మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 14వరకు తుది గడవుగా నిర్ణయించారు. 15న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.