బండి సంజయ్ హౌస్ అరెస్ట్

0
718

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేశారు. గత రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ లో సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రంతా అక్కడే ఉంచారు. ఉదయం అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఆయనను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. పార్టీ ఆఫీసు నుంచి బయటకు రాకుండా పోలీసులు మోహరించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బండి సంజయ్ ను తెలంగాణ పోలీసులు కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడులోనే ఉన్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆయన మునుగోడు బయలుదేరారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.

మునుగోడు ఓటర్లను టీఆర్ఎస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నారన్న సమాచారంతో అర్దరాత్రి సమయంలో మునుగోడుకు బయలుదేరిన సంజయ్ ను రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. మునుగోడు ఎన్నికల పోలింగ్ సరళిని సంజయ్ పార్టీ ఆఫీసు నుండే పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ దాడులకు, ప్రలోభాలకు బెదరకుండా పోలింగ్ సజావుగా సాగేలా, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రతి కార్యకర్త అప్రమత్తంగా వ్యవహరించాలని సంజయ్ సూచించారు.