తెలంగాణలో విద్యుత్ చార్జీల బాదుడు షురూ

0
706

తెలంగాణ‌లో విద్యుత్ చార్జీల బాదుడు మొదలవ్వనుంది. విద్యుత్ చార్జీల పెంపున‌కు సంబంధించి ప్ర‌భుత్వం పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌కు ఎల‌క్ట్రిసిటీ రెగ్యులేట‌రీ క‌మిష‌న్ (ఈఆర్‌సీ) బుధ‌వారం నాడు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప్ర‌భుత్వం నుంచి త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల మేర‌కు విద్యుత్ చార్జీల పెంపున‌కు అనుమ‌తిస్తున్న‌ట్లుగా క‌మిష‌న్ చెప్ప‌డంతో విద్యుత్ చార్జీల పెంపుపై ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నుంది. క‌మిష‌న్ వెల్ల‌డించిన మేర‌కు గృహ వినియోగ‌దారుల‌కు యూనిట్‌పై 50 పైస‌లు, పారిశ్రామిక వినియోగంపై యూనిట్‌కు రూ.1 పెర‌గ‌నున్నాయి. ఈ పెరిగిన ధ‌ర‌లు ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. విద్యుత్ చార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌ల‌పై రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో బ‌హిరంగ విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు తెలిపిన క‌మిష‌న్‌.. చార్జీల పెంపున‌కు అనుమ‌తిస్తున్న‌ట్లు పేర్కొంది. 18 శాతం విద్యుత్‌ చార్జీల పెంపునకు ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యు త్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్, టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌)లతో పాటు సిరిసిల్ల కోఆపరేటివ్‌ ఎలక్ట్రిసిటీ సప్లై సొసైటీ అనుమతి కోరగా, 14% పెంచుకోవడానికి అనుమతిచ్ఛారు.

డిస్కంల వినతి మేరకు కరెంటు ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14 శాతం విద్యుత్ చార్జీలను పెంచుతూ తెలంగాణ ఈఆర్సీ ఉత్తర్వలు జారీ చేసింది. డొమెస్టిక్ మీటర్లపై యూనిట్ కు 40 నుంచి 50 పైసల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇతర కేటగిరీలపై యూనిట్ కు రూపాయి చొప్పున పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 19 శాతం మేర విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరగా.. 14 శాతం మాత్రమే విద్యుత్ చార్జీలను పెంచుతూ తెలంగాణ ఈఆర్ఎసీ ఉత్తర్వులు జారీ చేసింది.

2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్‌ రిటైల్‌ సప్లై టారిఫ్‌ ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ) చైర్మన్‌ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్య బుధవారం ప్రకటించారు. ఎల్టీ కేటగిరీలోని గృహ వినియోగంపై యూనిట్‌కు 10–50 పైసలు చొప్పున, ఎల్టీ కేటగిరీలోని గృహేతర వినియోగంతో పాటు హెచ్‌టీ కేటగిరీలోని అన్ని రకాల వినియోగంపై యూనిట్‌కు రూ.1 చొప్పున చార్జీలు పెరగనున్నాయి. గృహ కేటగిరీలో ఒక శ్లాబు నుంచి మరో శ్లాబుకు మారిన వెంటనే ఉండే తదుపరి ఉప కేటగిరీకి యూనిట్‌కు 10 పైసలు చొప్పున, మిగిలిన అన్ని ఉప కేటగిరీలకు 50 పైసలు చొప్పున చార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతిచ్చింది.