ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని తేజస్వి యాదవ్ బంగ్లాను కేవలం రూ. 4 లక్షలకు కొనుగోలు చేశారని, దాని మార్కెట్ ధర ఇప్పుడు రూ. 150 కోట్లు అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. లాలూ యాదవ్ కొడుకు, కుమార్తెలపై వరుస దాడుల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ వ్యాఖ్యలు చేసింది. AB ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ చేసిన ఈ ఆస్తి నాలుగు అంతస్తుల బంగ్లా అని.. తేజస్వి యాదవ్, కుటుంబ సభ్యుల నియంత్రణలో ఉందని ఏజెన్సీ తెలిపింది. ఈ ఆస్తిని కొనుగోలు చేయడంలో భారీ మొత్తంలో నగదు ఉపయోగించినట్లు ఈడీ ఆరోపించింది. అక్రమ మార్గాలలో పొందిన డబ్బుతో ఈ ఆస్తిని సొంతం చేసుకుని ఉంటారని ఆరోపించింది ఈడీ. కాగితంపై, ఆస్తిని AB ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, AK ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంగా ప్రకటించారు. అయితే, దానిని తేజస్వి యాదవ్ నివాస ప్రాపర్టీగా ఉపయోగిస్తున్నారని దర్యాప్తు సంస్థ తెలిపింది.
ఈడీ సోదాల్లో రూ. 1 కోటి రూపాయల వరకు లెక్కలో చూపని నగదు, విదేశీ కరెన్సీ, 540 గ్రాముల బంగారం, 1.5 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. ఆర్థిక దర్యాప్తు సంస్థ యాదవ్ కుటుంబ సభ్యులు, బినామీల పేర్లపై వివిధ ఆస్తి పత్రాలు, సేల్ డీడ్‌లతో సహా నేరారోపణ పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. రూ. 350 కోట్ల విలువైన స్థిరాస్తులు, వివిధ బినామీదారుల ద్వారా రూ. 250 కోట్ల లావాదేవీల రూపంలో సుమారు రూ.600 కోట్ల రాబడికి సంబంధించిన ఆధారాలు లభించాయి.
ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ లో భాగంగా ఈ తనిఖీలు జరిగాయి. కొన్ని రోజుల క్రితమే ఈ కేసుతో లింకు ఉన్న బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మనీల్యాండరింగ్‌కు పాల్పడిందని, ఈ కేసుతో లింకున్న 15 ప్రదేశాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మార్చి ఏడో తేదీన మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను కూడా సీబీఐ విచారించింది. కుమార్తె మీసా భారతి ఇంట్లో ఉంటున్న లాలూను సుమారు అయిదు గంటల పాటు ప్రశ్నించారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న లాలూ ప్రస్తుతం తన కూతురు ఇంట్లో ఉంటున్నారు.