More

  ‘హువావే’ను తలదన్నేలా..
  కాబోయే 5జీ ఛాంపియన్ ‘తేజస్’..!

  అమెరికాకు చెందిన క్వాల్కామ్, చైనాకు చెందిన హువావే కంపెనీలు ప్రస్తుతం 5జీ ఛాంపియన్లుగా చెలామణి అవుతున్నాయి. క్వాల్కామ్ 5జీకి బాటలు వేస్తే.. హువావే సత్తా చాటుతోంది. అమెరికాలో క్వాల్కామ్ 5జీ లీడర్ అయితే, చైనా 5జీ లీడర్ హువావే. మరి, భారత్‎లో 5జీ ఛాంపియన్ ఎవరు..? మన దేశంలో 5జీ టెక్నాలజీని విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నదెవరు..? ప్రస్తుతం ఈ ప్రశ్నకు సమాధానం లేదు. కానీ, అతి త్వరలో ‘తేజస్’ రూపంలో దీనికి సమాధానం లభించబోతోంది.

  ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పూర్తి స్వదేశీ 5జీ హైటెక్ కంపెనీ ‘తేజస్’.. భారత్‎లో నెంబర్ వన్ 5జీ కంపెనీగా రూపాంతరం చెందుతోంది. 5జీ పేరు చెప్పగానే చైనాలో ఎలాగైతే ‘హువావే’ పేరు వినిపిస్తుందో.. అలాగే భారత్‎లో ‘తేజస్’ పేరు మారుమోగనుంది. ఆప్టికల్ నెట్‎వర్క్, 4జీ, 5జీ టెక్నాలజీ పరికరాలను ‘తేజస్’ తయారుచేస్తోంది. రౌటర్లు, స్విచ్చులతో సహా 5జీకి సంబంధించిన ప్రతి పరికరం ‘తేజస్’ తయారు చేస్తోంది. ప్రస్తుతం భారత్‎లో రెండు దశాబ్దాలుగా 4జీ, 5జీ పరికరాలను అందిస్తున్న ఏకైక స్వదేశీ సంస్థ ‘తేజస్’. 2000 సంవత్సరంలో ప్రారంభమైన తేజస్ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. దేశంలోనే కాదు, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకు కూడా 4జీ, 5జీ ఎక్విప్‎మెంట్స్ అందిస్తోంది.

  జూలై చివరివారంలో తేజస్ నెట్‎వర్క్స్ నుంచి టాటా గ్రూప్ పెద్దయెత్తున వాటాలు కొనుగోలు చేసింది. తద్వారా టెలికామ్ పరికరాల తయారీ మార్కెట్లోకి ప్రవేశించింది టాటా గ్రూప్. టెలికామ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్‎లో ఇప్పటికే టాటా గ్రూప్‎కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సత్తా చాటుతోంది. హార్డ్‎వేర్ సామర్థ్యం లేనికారణంగా 5జీ పరికరాల తయారీ విషయంలో వెనుకబడిపోయింది. ఇప్పుడు తేజస్‎తో కలిసి ఆ లోటును బర్తీ చేసుకోవాలనుకుంటోంది టాటా గ్రూప్. 1,850 కోట్లతో తేజస్ నుంచి 43.35 శాత షేర్లను కొనుగోలు చేసింది. అంతేకాదు, రానున్న రోజుల్లో మరిన్ని వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది.

  ఈ డీల్‎తో‎ టాటా గ్రూప్ మరింత నూతనోత్తేజం సంతరించుకుంటుందని మేనేజ్‎మెంట్ కన్సల్టెన్సీ అనాలసిస్ నిపుణులు అశ్విందర్ సేథి చెప్పారు. ఒకవైపు సొంత 5జీని డెవలప్ చేసుకుంటూనే.. మరోవైపు ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించాలని టాటా గ్రూప్ భావిస్తోంది. ఇప్పటికే టాటా గ్రూప్ సంస్థ టీసీఎస్ సాఫ్ట్‎వేర్ ఇంటిగ్రేషన్‎లో టాప్ కంపెనీల్లో ఒకటిగా వుంది. ఇప్పుడు తేజస్‎తో కలిసి హార్డ్‎వేర్ సామర్థ్యాన్ని కూడా ప్రోది చేసుకోనుంది.

  నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ అయిన 5జీ అభివృద్ధి.. సాఫ్ట్‎వేర్, హార్డ్‎వేర్ కలియికతోనే సాధ్యం. అందుకే, టాటా గ్రూప్ తేజస్‎తో జతకట్టింది. సాఫ్ట్‎వేర్ దిగ్గజం టీసీఎస్, హార్డ్‎వేర్ దిగ్గజం తేజస్ కలిసి దేశంలో బలమైన 5జీ మార్కెట్ శక్తిగా అవతరించనున్నాయి. టెలికాం ఇన్‎ఫ్రాస్ట్రక్చర్ కోసం.. దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లైన ఎయిర్‎టెల్, టాటా టెలీ కమ్యూనికేషన్స్ వంటి సంస్థలు.. ఇప్పటికే టాటా గ్రూప్‎తో కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి.

  దేశంలో 5జీ నెట్ వర్క్‎ను విస్తరించుకునే క్రమంలో.. తమ ఆప్టికల్ నెట్‎వర్క్ విస్తరణ కోసం తేజస్‎తో ఇప్పటికే ఎయిర్‎టెల్ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం సాకారమైతే దేశంలో 5జీ విప్లవం ప్రారంభం కానుంది. అదే జరిగితే, క్లౌడ్ గేమింగ్, వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అందరీకి అందుబాటులోకి రానుంది.

  ఇక, ఎప్పుడైతే టాటా గ్రూప్ తేజస్‎లో పెట్టుబడులు పెట్టిందో.. అప్పటి నుంచి ఆ కంపెనీ షేర్లు విపరీతంగా పెరుగుతున్నాయి. గత రెండు నెలల్లోనే తేజస్ షేర్ విలువు రెండింతలైంది. అంతేకాదు, ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి కూడా తేజస్‎కు కాంట్రాక్ట్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం 5జీ అభివృద్ధిలో తేజస్‎తో కలిసి పనిచేసేందుకు భారత ప్రభుత్వం కూడా వుంది. ఎందుకంటే, చైనా ప్రభుత్వం అక్కడ హువావేతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‎వర్క్‎గా అవతరించింది. ఈ కోవలోనే తేజస్‎తో కలిసి బీఎస్ఎన్ఎల్‎ను కూడా నేషనల్ ఛాంపియన్ గా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

  దేశీయంగా.. 4జీ, 5జీ రేడియో ఆక్సెస్ నెట్‎వర్క్, వైర్‎లెస్ ఎక్విప్‎మెంట్, ఐవోటీ యాక్సెస్ డివైజెస్, ఇంకా ఇతర వైర్‎లెస్ పరికరాలు, స్విచ్చులు, రౌటర్ల అభివృద్ధిని మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఆత్మనిర్భర్ భారత్‎లో భాగంగా.. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్‎ స్కీమ్‎ ద్వారా ఇప్పటికే 12 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. దేశంలో టెలికాం పరికరాల తయారీ ద్వారా.. పీఎల్ఐ స్కీమ్ నుంచి తేజస్ కూడా భారీగా ప్రోత్సాహకాలు అందుకోవాలని భావిస్తోంది. రానున్న ఐదేళ్లో దేశంలో టెలికాం పరికరాలను తయారుచేసే స్వదేశీ కంపెనీలకు.. మోదీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. మోదీ ప్రభుత్వం ఇదంతా చేస్తున్నది.. టెలీకమ్యూనికేషన్స్ పరికరాల తయారీలో భారత్ ‘ఆత్మనిర్భరం’గా మారడానికి మాత్రమే కాదు.. టెలీకమ్యూనికేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా చైనీస్, యూరోపియన్ కంపెనీల పెత్తనాన్ని అంతం చేయడానికి కూడా.

  మోదీ ప్రభుత్వం.. టెలీకమ్యూనికేషన్ పరికరాల తయారీలో స్వదేశీ సంస్థలను ప్రోత్సహించడమే కాదు.. తద్వారా.. దేశంలో టెలికాం మౌలిక సదుపాయాల మెరుగుదలకు, టెలికాం ఆధారిత ఐటీ రంగం ఎగుదలకు బాటలు వేస్తోంది. అంతేకాదు, 5జీ టెక్నాలజీకి సంబంధించిన టెలికాం ఉత్పత్తుల ఎగుమతులను కూడా ప్రోత్సహిస్తోంది. రానున్న ఐదేళ్లలో చైనాకు చెందిన హువావే, ZTE తరహాలో.. 5జీ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంటుంది. 5జీ టెక్నాలజీలో చైనాను తలదన్నేలా ప్రపంచ ఛాంపియన్‎గా అవతరించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

  Trending Stories

  Related Stories