మొన్నటిదాక ప్రధాని నరేంద్రమోదీకి 2002 గురజాత్ అల్లర్ల కేసు మాయని మచ్చగా మారింది. గత నెల సుప్రీంకోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడంతో దీనిపై సిట్ విచారణ వేగవంతం చేసింది.
అసలు అల్లర్లకు ఎవరు సూత్రదారులు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే సామాజిక కార్యకర్త తీస్తా సెతల్ వాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తీస్తా సెతల్వాద్ బెయిల్ దరఖాస్తును గుజరాత్ పోలీసులు తిరస్కరించారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్, దివంగత నేత అహ్మద్ పటేల్ చేసిన పెద్ద కుట్రలో ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ భాగమని పేర్కొంటూ ఆమె బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చారు.
అప్పటి గుజరాత్ అల్లర్ల కేసులో ఆనాటి సీఎం నరేంద్ర మోదీని ఇరికించేందుకు అహ్మద్ పటేల్ ప్రయత్నించినట్లు సిట్ తన రిపోర్ట్‌లో ఆరోపించింది. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్‌లకు అహ్మద్ పటేల్ 30 లక్షలు ఇచ్చారని, అల్లర్ల కేసులో మోదీని ఇరికించాలనే ఉద్దేశంతో పటేల్ ఆ డబ్బులు ఇచ్చినట్లు సిట్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. సెతల్వాద్, శ్రీకుమార్‌లు నేర కుట్రకు, ఫోర్జరీకి పాల్పడినట్లు సిట్ వెల్లడించింది. కాంగ్రెస్ నుంచి అక్రమంగా డబ్బు తీసుకునేందుకే తీస్తా, శ్రీకుమార్‌లు కుట్రకు పాల్పడినట్లు సిట్ తేల్చింది. ఈ నేపథ్యంలో సిట్ ఏసీపీ బీసీ సోలంకి తరపున న్యాయవాదులు సెషన్స్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
సిట్ వాదనలు రికార్డు చేసిన అదనపు సెషన్స్ జడ్జి.. తీస్తా బెయిల్ దరఖాస్తుపై విచారణను సోమవారానికి వాయిదా వేశారు. జూలై రెండవ తేదీన తీస్తా, శ్రీకుమార్‌లను 14 రోజుల పాటుకు రిమాండ్‌కు తరలిస్తూ అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్ అల్లర్ల కేసుతో లింకు ఉన్న డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిన కేసులో మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్‌ను అహ్మదాబాద్ క్రైం బ్రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. గోద్రా ఘటన తర్వాత ఆనాటి సీఎం మోదీ ప్రతిష్టను దిగజార్చేందుకు తీస్తా, శ్రీకుమార్, సంజీవ్‌లు రకరకాల పిటిషన్లు దాఖలు చేసినట్లు సిట్ తెలిపింది. అహ్మద్ పటేల్‌తో నిందితులు పలుమార్లు కలిశారని, పటేల్ నుంచి తొలుత 5 లక్షలు, ఆ తర్వాత రెండు రోజులకు 25 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2020లో అహ్మద్ పటేల్ మరణించారు.
సిట్ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ప్రధాని మోదీ రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారని, మరణించిన వారిని కూడా తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నట్లు జైరాం రమేశ్ తన ట్వీట్లో ఆరోపించారు. విపక్షాలను తప్పుపట్టేందుకు తన తండ్రి పేరును వాడుతున్నట్లు అహ్మద్ పటేల్ కూతురు ముమ్తాజ్ పటేల్ ఆరోపించారు. యూపీఏ సమయంలో తీస్తా సెతల్వాద్‌కు ఎందుకు రివార్డులు ఇవ్వలేదని ఆమె వెనకేసుకొచ్చారు. ఒకవేళ ఇంత పెద్ద కుట్ర జరిగితే తన తండ్రిని ఎందుకు ప్రభుత్వం ప్రొసిక్యూట్ చేయలేదని ఆమె వితండవాదం చేశారు.
అయితే గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి సీఎంగా ఉన్న ప్రధాని మోదీని ఇరికించేందుకు తీస్తా విశ్వ ప్రయత్నాలు చేయడం తాజా సిట్ నివేదికకు అజ్యం పోస్తోంది. 2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీలో అల్లరి మూకలు జరిపిన దాడిలో కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ సహా 68 మంది మరణించారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసుతో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సహా మరికొంతమందికి ఎలాంటి సంబంధం లేదని సిట్ తేల్చింది. సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ భార్య జకియా పలు కోర్టులను ఆశ్రయించారు. మార్చి 2008న సుప్రీంకోర్టు నియమించిన సిట్.. ఆమె ఆరోపణలపై విచారణ చేపట్టింది.
2010లో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని సిట్ దాదాపు తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులోని అన్ని ఆరోపణల నుంచి ప్రధాని మోదీని సిట్ తప్పించింది. ఆ తర్వాత ప్రధాని మోదీకి ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌తో కలిసి 2012 ఫిబ్రవరి 9న జకీయా మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు సిట్ ఉత్తర్వులను సమర్థించడంతో జఫ్రీ, సెతల్వాద్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టులోనూ చుక్కెదురవడంతో సిట్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయించగా.. గతనెల జూన్ 24న సర్వోన్నత న్యాయస్థానం కూడా వారి పిటిషన్‌ను కొట్టివేసింది.