Telugu States

ఇప్పటి వరకు 35 కేసులు.. ఒకటి పోతే ఇంకో కేసు..!

క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై కేసులు ఒకదాని తర్వాత ఒకటిగా నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన భార్య మాతమ్మ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఎంపీ అరవింద్ కుమార్, సోదరుడితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆమె అమిత్ షాను కలిసి తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. అక్రమంగా కేసులు పెట్టి మల్లన్నను వేధిస్తున్నారని ఆరోపించారు. కేసు మీద కేసు పెడుతూ జైలుకు పంపే కుట్ర చేస్తున్నారని.. ఇప్పటి వరకు 35 కేసులు పెట్టారని ఆమె అమిత్ షాకు విన్నవించుకున్నారు. ఒక కేసులో బెయిలు వస్తే మరో కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆమె అన్నారు. ఈ మేరకు మల్లన్నపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలతో కూడిన లేఖను అందించారు.

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై నిజామాబాద్ జిల్లాలో మరో కేసు నమోదైంది. తన నుంచి తీన్మార్ మల్లన్న రూ. 5 లక్షలు, ఉప్పు సంతోష్ రూ. 20 లక్షలు డిమాండ్ చేశారంటూ నిజామాబాద్‌కు చెందిన ఓ కల్లువ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్‌ను ఎ1గా, నవీన్‌ను ఎ2గా చేర్చారు. అనంతరం సంతోష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఓ కేసులో ఇప్పటికే జైలులో ఉన్న మల్లన్నకు ఈ కేసులో పీటీ వారెంట్ చేయనున్నట్టు పోలీసులు వర్గాలు తెలిపాయి.

తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీ లోకి రాబోతున్నారని ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు కూడా చెప్పేశారు. తీన్మార్ మల్లన్న బయటకు రాగానే బీజేపీలోకి అధికారికంగా చేరబోతున్నారని తెలుస్తోంది. అయితే ఒక కేసులో తీన్మార్ మల్లన్న విడుదలవ్వగానే మరో కేసు పెడుతుండడంతో పోలీసులు అరెస్టు చేస్తూనే ఉన్నారు. క్యూన్యూస్ చీఫ్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరనున్నారని ఆయన సొంత చానల్ క్యూ న్యూస్ అధికారికంగా కొద్దిరోజుల కిందట తెలిపింది. మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. పలు కేసులు ఎదుర్కొంటూ తీన్మార్ మల్లన్న జైలులో ఉన్నారు. ఆయనను విడుదల చేయించేందుకు ఆయన భార్య మాతమ్మ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాకి లేఖలు రాయడం సంచలనంగా మారింది. జేపీ నడ్డాకు తీన్మార్ మల్లన్న భార్య ముత్తమ్మ లేఖ కూడా రాశారు. తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరుతారని ఆమె తెలిపారు. కేసీఆర్ అవినీతి అరాచకాలపై కొన్నేళ్లుగా మల్లన్న పోరాడుతున్నారని, అందుకే మల్లన్నపై అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారని మాతమ్మ అన్నారు. కేసీఆర్ అరాచకానికి చరమ గీతం పాడాలంటే బీజేపీతోనే సాధ్యమని, ప్రధాని మోదీ ప్రేరణతో మల్లన్న బీజేపీలో చేరాలనుకుంటున్నారని మాతమ్మ లేఖలో పేర్కొన్నారు.

Related Articles

Back to top button