More

  ఎట్టకేలకు తీన్మార్ మల్లన్నకు బెయిల్.. బీజేపీతో కలిసి టీఆర్ఎస్ పై ఫైట్

  జర్నలిస్ట్‌ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కు ఎట్టకేలకు బెయిల్‌ మంజూరు అయింది. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌తో పాటు రాష్ట్రంలోని పలు పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల్లో తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అరెస్ట్‌ చేసి రెండు నెలలకుపైగా జైల్లో ఉంచారు. అతని కార్యాలయంలో పోలీసులు చేసిన సోదాల్లో హార్డ్‌ డిస్క్‌లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బెయిల్‌ కోసం తీన్మార్‌ మల్లన్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇవాళ బెయిల్‌ మంజూరు చేసింది. తీన్మార్‌ మల్లన్న పై ఇప్పటి వరకు 38 కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ఆరు కేసులను కోర్టు కొట్టివేసింది. మిగిలిన 32 కేసుల్లో 31 కేసులకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇవాళ సాయంత్రం తీన్మార్‌ మల్లన్న జైలు విడుదల అయ్యే అవకాశం ఉంది.

  బీజేపీ లోకి మల్లన్న:

  క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై కేసులు ఒకదాని తర్వాత ఒకటిగా నమోదవుతో వచ్చాయి. అక్రమంగా కేసులు పెట్టి మల్లన్నను వేధిస్తున్నారని పలువురు ఆరోపించారు. కేసు మీద కేసు పెడుతూ జైలుకు పంపే కుట్ర చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఒక కేసులో బెయిలు వస్తే మరో కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు మల్లన్నపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలతో కూడిన లేఖను ఆయన భార్య అమిత్ షా కు కూడా అందించారు. తీన్మార్‌ మల్లన్న భార్య ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసింది. తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫిర్యాదు చేసింది. జాతీయ బీసీ కమిషన్ కూడా తీన్మార్‌ మల్లన్నపై పెట్టిన కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

  తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీ లోకి రాబోతున్నారని ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు కూడా చెప్పేశారు. తీన్మార్ మల్లన్న బయటకు రాగానే బీజేపీలోకి అధికారికంగా చేరబోతున్నారని తెలుస్తోంది. క్యూన్యూస్ చీఫ్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరనున్నారని ఆయన సొంత చానల్ క్యూ న్యూస్ అధికారికంగా కొద్దిరోజుల కిందట తెలిపింది. మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు తీన్మార్ మల్లన్న భార్య ముత్తమ్మ లేఖ కూడా రాశారు. తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరుతారని ఆమె తెలిపారు. కేసీఆర్ అవినీతి అరాచకాలపై కొన్నేళ్లుగా మల్లన్న పోరాడుతున్నారని, అందుకే మల్లన్నపై అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారని ముత్తమ్మ అన్నారు. కేసీఆర్ అరాచకానికి చరమ గీతం పాడాలంటే బీజేపీతోనే సాధ్యమని, ప్రధాని మోదీ ప్రేరణతో మల్లన్న బీజేపీలో చేరాలనుకుంటున్నారని ముత్తమ్మ లేఖలో పేర్కొన్నారు.

  Trending Stories

  Related Stories