ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న టెక్ దిగ్గజాలు.. 2023 నుండి మరింత కష్టకాలమా..?

0
726

ప్రముఖ టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగించడానికి సిద్ధపడుతూ ఉన్నాయి. నిర్ధాక్షిణ్యంగా ఏ మాత్రం ఆలోచించకుండా సాఫ్ట్ వేర్ ఉద్యోగులను టెక్ కంపెనీలు తొలగించేస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో తమ పరిస్థితి ఏమిటా అని అందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు.

తాజాగా గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. మెటా, ట్విట్టర్, అమెజాన్ తరహాలోనే ఆల్ఫాబెట్ కూడా 10,000 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 1,87,000 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల తొలగింపుకు అంతర్జాతీయంగా నెలకొంటున్న కఠిన పరిస్థితులే కారణమని అంటోంది. న్యూ ర్యాంకింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్ ద్వారా పనితనం సరిగాలేని ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని బ్రాంచ్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ 2023 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.

హెచ్ పీ సైతం 2025 మార్చి నాటికి 12 శాతం మేర ఉద్యోగులను తగ్గించుకోడానికి టార్గెట్ పెట్టుకుంట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో మేరీ మయర్స్ ప్రకటించారు. 12 శాతం అంటే సుమారు 6,000 మంది హెచ్ పీ ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. కంప్యూటర్ విక్రయాలు తగ్గిపోవడంతో సంస్థపై భారం పెరిగేలా చేసింది. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకోవడం కంపెనీకి ప్రాధాన్యంగా మారింది.

ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి టాటా కంపెనీ తీపి కబురు ఇచ్చింది. టాటా కొనుగోలు చేసిన జాగ్వార్ లాండ్ రోవర్ కంపెనీలోకి ట్విట్టర్, మెటా కంపెనీలు వదిలిన ఉద్యోగుల్లోంచి 800 మంది తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ డ్రైవ్ ద్వారా జాగ్వార్ లాండ్ రోవర్ కంపెనీలోని డిజిటల్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు. భారత్, యూకే, ఐర్లాండ్, చైనా, యూఎస్ఎ, హంగేరీ దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్, క్లౌడ్ సాఫ్ట్‌వేర్, డేటా సైన్స్, ఎలక్ట్రిఫికేషన్, మెషిన్ లెర్నింగ్ డిపార్ట్ మెంట్స్ లోకి ఉద్యోగుల్ని తీసుకోనున్నారు.