రాజాసింగ్ చేతుల మీదగా ‘రజాకార్’ టీజర్‌ విడుదల..!

0
233

సెప్టెంబర్ 17న ఎమ్మెల్యే రాజా సింగ్ తెలుగు సినిమా ‘రజాకార్’ టీజర్‌ను విడుదల చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా హైదరాబాద్ కు స్వాతంత్య్రం రాని సమయం. ఆ సమయంలో నిజాం పాలకులు చేసిన దారుణాలను ఈ సినిమా టీజర్ లో చూపించారు. స్వాతంత్య్రానంతరం హైదరాబాదు భారతదేశంలో ఇంకా చేరని సమయంలో పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇతర మతాలను అణగదొగ్గి.. కేవలం ఇస్లాం వ్యాప్తి చేయాలని ఎలా అనుకున్నాడు..? తెలుగు, మరాఠీ వంటి భాషలను లేకుండా చేసి కేవలం ఉర్ధూ మాత్రమే ఉండేలా చేసిన ప్రయత్నం.. హిందువులు అనుభవించిన ఎన్నో దారుణాలను ఈ సినిమాలో చూపించారు.

1948 హైదరాబాద్ విముక్తి ఉద్యమంలో ‘రజాకార్’ అని పిలువబడే నిజాం పాలకుల దళాలు హిందువులపై చేసిన అకృత్యాలను ఈ చిత్రంలో చూపించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. టీజ‌ర్‌లోనే రజాకార్లు చేసిన దారుణాలను చూస్తుంటే రక్తం మరిగిపోతూ ఉండగా.. సినిమాలో ఇంకెన్ని దారుణాలను మన కళ్లకు కట్టినట్లు చూపించారనేది ఆసక్తిగా మారింది. అందుకే టీజర్ చూసిన వాళ్లంతా సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తూ వస్తున్నారు. సమరవీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి బాబీ సింహా, వేదిక ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సత్యనారాయణ దర్శకుడుగా ఉన్నారు. సుద్దాల అశోక్ తేజ ఈ చిత్రానికి పాటలు రాయగా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని 2024లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక టీజర్ ఆఖర్లో.. హైదరాబాద్ ను కాపాడుకోడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చే సన్నివేశం గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

భారతదేశం మొత్తం బ్రిటీష్ వారి ఆధీనం నుంచి విడివడి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సాధించుకున్నా తెలంగాణ ప్రాంతానికి మాత్రం అప్పట్లో విమోచన కలగలేదు. నైజాం పాలకుల దాష్టీకం నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి కోసం ఉద్యమాలు జరిగాయి. హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో అంతర్భాగం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆపరేషన్ పోలో పేరిట సైనిక చర్యను చేపట్టింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్‌ను భారతదేశం తన సైన్యంతో అష్ట దిగ్బంధనం చేసేసింది. నిజాం చెర నుంచి విముక్తి పరచడానికి భారత సైన్యాలు నిజాం సైన్యంతో భీకరంగా పోరాడాయి. లెఫ్టినెంట్ జనరల్ మేజర్ జనరల్ మహారాజ్ రాజేంద్రసింగ్ సారధ్యంలో మేజర్ జనరల్ డి.ఎస్. బ్రార్ ముంబై సెక్టార్ నుంచి ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ. రుద్ర మద్రాస్ సెక్టర్ నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ సెక్టార్ నుంచి తన సేనలతో హైదరాబాద్ సంస్థానాన్ని దిగ్బంధించారు. అప్పటి భారత వైమానిక దళ ఎయిర్ వైస్ మార్షల్ ముఖర్జీ సైతం రంగంలోకి దిగారు. భారత సైన్యం వివిధ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ హైదరాబాద్ దిశగా పయనించాయి. చివరకు నిజాం సైన్యాధికారి ఎడ్రూస్ చేతులెత్తేశాడు. దీంతో నిజాం నవాబు ఓటమిని అంగీకరించి17వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో భారత సైన్యానికి స్వాగతం పలికారు. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను సాదరంగా ఆహ్వానించి చేతులు జోడించి నమస్కరించాడు. అనంతరం హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీనమైంది.