Sports

టీ20 సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్

మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ సిరీస్ ను సొంతం చేసుకుంది. బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 49 పరుగుల తేడాతో భారత్ ఇంగ్లండ్ ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 17 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ అయింది. భువనేశ్వర్ కుమార్ 3, బుమ్రా 2, చహల్ 2, హార్దిక్ పాండ్యా 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ జట్టులో మొయిన్ అలీ 35, డేవిడ్ విల్లీ 33 పరుగులు చేశారు. మిగిలిన వారెవరూ భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయారు.

టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 31 పరుగులు చేయగా, ఓపెనర్ గా వచ్చిన రిషబ్ పంత్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 26 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ కొత్త బౌలర్ రిచర్డ్ గ్లీసన్ అద్భుత బౌలింగ్ తో కేవలం 15 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. రోహిత్ శర్మను అవుట్ చేసిన గ్లీసన్… తన మరుసటి ఓవర్లో వరుస బంతుల్లో కోహ్లీ, పంత్ లను అవుట్ చేసి టీమిండియాను దెబ్బకొట్టాడు. 3 బంతులాడిన కోహ్లీ కేవలం 1 పరుగు చేసి పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ 15, హార్దిక్ పాండ్యా 12, దినేశ్ కార్తీక్ 12, హర్షల్ పటేల్ 13 పరుగులు చేశారు. టీమిండియా 122 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూకుడుగా ఆడడంతో 170 పరుగుల మంచి స్కోరును టీమిండియా సాధించింది. జడేజా 29 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4, గ్లీసన్ 3 వికెట్లు తీశారు. నేడు ట్రెంట్ బ్రిడ్జ్ లో ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.

Related Articles

Back to top button