టెస్ట్ మ్యాచ్ లు ఇంత మజా ఇస్తాయా అని ఇటీవల భారత్ ఆడుతున్న మ్యాచ్ లను చూస్తే స్పష్టమవుతోంది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ను భారత క్రికెటర్లు అందిస్తూ వస్తున్నారు. విదేశీ గడ్డలపై అద్భుతమైన విజయాలను అందుకుంటూ వెళుతున్నారు. ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో 157 పరుగుల భారీ తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. 368 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ ను 210 పరుగులకే ఆలౌట్ చేసింది భారత్. బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ పై టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3, బుమ్రా 2, శార్దూల్ ఠాకూర్ 2, రవీంద్రజడేజా 2 వికెట్లు తీశారు. ఐదో రోజు ఆటలో కేవలం 110 పరుగులు చేసిన ఇంగ్లండ్ 10 వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 290 పరుగులు చేసి 99 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో పుంజుకున్న టీమిండియా 466 పరుగులు నమోదు చేసి, ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది. నాలుగో రోజు ఆట చివరికి ఒక్క వికెట్టు కూడా కోల్పోకుండా 77 పరుగులు చేసిన ఆతిథ్య ఇంగ్లండ్, చివరిరోజు భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ సిరీస్ లో తొలి టెస్టు డ్రా కాగా, రెండో టెస్టును భారత్ నెగ్గింది. మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమం అయింది. తాజా విజయంతో టీమిండియా 5 టెస్టుల సిరీస్ లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు ఈ నెల 10 నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది.
ఈ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా రాణించాడు. లండన్ లోని ఓవల్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బుమ్రా మొత్తం 4 వికెట్లు తీశాడు. అంతేకాదు, టెస్టుల్లో 100 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. తద్వారా భారత్ తరఫున టెస్టుల్లో వేగంగా 100 వికెట్లు సాధించిన బౌలర్ గా అవతరించాడు. కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును బుమ్రా చెరిపేశాడు. కపిల్ 100 వికెట్ల మార్కును చేరుకునేందుకు 25 టెస్టులు ఆడగా, బుమ్రా 24 టెస్టుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. మరే భారత బౌలర్ కు సాధ్యం కాని రీతిలో అతి తక్కువ సగటుతో 100 వికెట్లు సాధించింది కూడా బుమ్రానే. బుమ్రా 22.45 సగటుతో 100 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన భారత బౌలర్లలో ఓవరాల్ గా చూస్తే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కేవలం 18 టెస్టుల్లోనే ఆ ఘనత అందుకున్నాడు.