దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో మొదటి రెండు టీ20 మ్యాచ్ లలో ఓడిపోయిన భారత్.. తర్వాతి రెండు మ్యాచ్ లలో పుంజుకుని సిరీస్ లో నిలిచింది. నాలుగో టీ-20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను 87 పరుగులకే ఆలౌట్ చేసి భారత్ 82 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత ఆటగాళ్లు సిరీస్ ను 2-2తో సమం చేశారు.
రాజ్ కోట్ వేదికగా సాగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్ 26 బంతుల్లో 27 పరుగులు చేసి నోర్జే బౌలింగ్ లో వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ (4) నిరాశపరిచాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 17 పరుగులు చేసి కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ లు దూకుడుగా ఆడి మంచి స్కోర్ వచ్చేలా చేశారు. దినేశ్ కార్తీక్ 27 బంతుల్లోనే 55 పరుగులు( 9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశాడు. హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 46 రన్స్) కూడా ధాటిగా ఆడడంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు తీయగా, మార్కో జాన్సెన్ 1, ప్రిటోరియస్ 1, నోర్జే 1, కేశవ్ మహరాజ్ 1 వికెట్ సాధించారు.
170 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌట్ అయింది. అవేష్ ఖాన్ 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, చహల్ (2 వికెట్లు), హర్షల్ పటేల్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీయడంతో టీమిండియా దక్షిణాఫ్రికాను ఆ జట్టు టీ20 హిస్టరీలో అతి తక్కువ పరుగులకు కట్టడి చేశారు. సఫారీ ఇన్నింగ్స్ లో వాన్ డర్ డుస్సెన్ 20 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ టెంబా బవుమా రిటైర్డ్ హర్ట్ గా అవుట్ అయ్యాడు. డికాక్ (14) రనౌట్ అవ్వడం భారత్ కు కలిసొచ్చింది. ఆ తర్వాత ప్రిటోరియస్ (0), క్లాసెన్ (8), మిల్లర్ (9) విఫలమవడంతో భారత్ విజయం ఖాయమైంది. దినేష్ కార్తీక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐదో టీ20 మ్యాచ్ ఈ నెల 19న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.