టీ20 ప్రపంచ కప్ లో భారత్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగినప్పటికీ.. సెమీస్ చేరకుండానే వెనుదిరిగింది. ఆఖరి లీగ్ మ్యాచ్ లో నమీబియాపై ఘన విజయం సాధించింది టీమిండియా. సూపర్-12 దశలో భాగంగా గ్రూప్-2లో జరిగిన మ్యాచ్ లో నమీబియాపై 9 వికెట్ల తేడాతో నెగ్గింది. 133 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అర్ధసెంచరీలతో రాణించారు. రోహిత్ శర్మ 37 బంతుల్లో 56 పరుగులు సాధించగా, కేఎల్ రాహుల్ 36 బంతుల్లో 54 పరుగులు చేశాడు. రోహిత్ స్కోరులో 7 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. కేఎల్ రాహుల్ 4 ఫోర్లు, 2 సిక్సులు సంధించాడు. రోహిత్ శర్మ అవుట్ కావడంతో బరిలోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. గ్రూప్-2లో పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్… ఆపై వరుసగా ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లపై ఘనవిజయాలు నమోదు చేసింది. 5 విజయాలతో పాకిస్తాన్, 4 విజయాలతో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకున్నాయి.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నమీబియా చెప్పుకోదగ్గ స్కోర్ చేయగలిగింది. జడేజా, అశ్విన్, బుమ్రా ధాటికి నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసింది. జడేజా 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, అశ్విన్ 20 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా కు 2 వికెట్లు దక్కాయి. నమీబియా ఓపెనర్లు స్టీఫెన్ బార్డ్ (21), మైకేల్ వాన్ లింగెన్ (14) పర్వాలేదనిపించారు. ఆల్ రౌండర్ డేవిడ్ వీజ్ 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో జాన్ ఫ్రైలింక్ (15 నాటౌట్), రూబెన్ ట్రంపుల్ మన్ (13) పరుగులు చేశారు. ఇక భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా కోహ్లీకి ఇదే చివరి టోర్నీ కాగా, టీమిండియా కోచ్ గా రవిశాస్త్రికి కూడా ఇదే ఆఖరి మ్యాచ్. నవంబరు 10న జరిగే తొలి సెమీస్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. నవంబరు 11న జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా ఢీకొట్టనున్నాయి. నవంబరు 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.