More

    సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. నంబర్ 1 ర్యాంకు కూడా మనదే..!

    మూడు వన్డేల సిరీస్‌ ను కోల్పోయినట్లుగానే విండీస్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ను కూడా కోల్పోయింది. టీ20 సిరీస్ లో కూడా భారత్ విండీస్ ను వైట్‌వాష్ చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మూడవ టీ20లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి 3-0తో సిరీస్‌ గెలుచుకుంది. భారత జట్టు తొలుత 184 పరుగులు చేసింది. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్ మాత్రమే విండీస్ జట్టులో రాణించారు. పూరన్ 47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 61 పరుగులు చేయగా, రొమారియో 21 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. రోవ్‌మన్ పావెల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 34, శ్రేయాస్ అయ్యర్ 25 పరుగులు సాధించగా, సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో ఫోర్, 7 సిక్సర్లతో 65 పరుగులు చేసి టీ20ల్లో తన నాలుగో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (4), కెప్టెన్ రోహిత్ శర్మ (7) పెద్దగా రాణించలేదు. విండీస్ బౌలర్లలో హోల్డర్, రొమారియో, రోస్టన్ చేజ్, హేడెన్ వాల్ష్, డొమినిక్ డ్రేక్స్‌కు తలా ఓ వికెట్ దక్కింది. సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.

    ఈ విజయంతో భారత్ టీ20ల్లో నంబర్ 1 గా నిలిచింది. 6 సంవత్సరాల తర్వాత భారత్ టీ20ల్లో నంబర్ 1 స్థానాన్ని తిరిగి పొందింది. ఎంఎస్ ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో భారత్ టీ20ల్లో నంబర్ 1 గా నిలిచింది. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టి భారత్ ను టాప్ లో నిలిపిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. విండీస్ తో సిరీస్ ను 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో భారత్ 270 పాయింట్లతో ఇంగ్లండ్‌ను అధిగమించింది. ఇంగ్లండ్ 269 పాయింట్లతో ఉంది.

    Trending Stories

    Related Stories