ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లోకి భారత్ అడుగుపెట్టింది. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో శ్రీలంక ఓడిపోవడం భారత్ కు కలిసి వచ్చింది. శ్రీలంక నిర్దేశించిన 285 పరుగుల లక్ష్యాన్ని 8 ఎనిమిది వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ ఛేదించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో కివీస్ విజయాన్ని అందుకోవడంతో శ్రీలంక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆస్ట్రేలియాతో చివరిదైన నాలుగో టెస్టులో గెలుపోటములతో సంబంధం లేకుండా టీమిండియా ఫైనల్ బెర్తు దక్కించుకుంది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు గెలిచిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. మూడో టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలవ్వడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఆసీస్ వెళ్ళింది. దీంతో భారత్ ఫైనల్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. మన జట్టు నేరుగా ఫైనల్ కు చేరాలంటే అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తప్పక నెగ్గాలి. నాలుగో టెస్టులో టీమిండియా ఓడినా, లేక డ్రా చేసుకున్నా.. శ్రీలంక, కివీస్ టెస్టు సిరీస్ పై ఆధారపడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఒక్క మ్యాచ్ అయినా శ్రీలంక ఓడిపోవాలి. ఈరోజు మ్యాచ్ లో శ్రీలంక ఓటమి పాలైంది. దీంతో భారత్ జూన్ లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.