దుబాయ్‌లో జరిగిన ఐసీసీ టీ 20 ప్రపంచ కప్-2021లో విరాట్ కోహ్లి సేన 10 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఓడిపోయిన తర్వాత టీమ్ ఇండియా పేసర్ మహమ్మద్ షమీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అతడిని మతం పేరుతో దూషించడం మొదలు పెట్టారు. అన్ని ఫార్మాట్లలో భారత్ ప్రముఖ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా ఉన్న షమీని పలువురు టార్గెట్ చేసినప్పుడు కెప్టెన్ కోహ్లీ, భారత క్రికెటర్లు, ఇతర మాజీ క్రికెటర్లు అతడికి మద్దతును ఇచ్చారు.
ఈ అనుభవం గురించి మహమ్మద్ షమీ మాట్లాడుతూ ఈ ట్రోల్స్ చేసే వారు.. నిజమైన అభిమానులు, నిజమైన భారతీయులు కాదని పేర్కొన్నాడు. ఈ రకమైన ఆలోచనలకు చికిత్స లేదని అన్నాడు. మతంపై ట్రోల్స్ చేసేవారు నిజమైన అభిమానులు కాదని, నిజమైన భారతీయులు కాదని చెప్పుకొచ్చాడు. మీరు ఒక ఆటగాడిని హీరోగా పరిగణించి, ఆ తర్వాత ఈ విధంగా విమర్శిస్తే మీరు భారత్ మద్దతుదారులు కాదు. అలాంటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరూ బాధపడకూడదని నేను భావిస్తున్నానని షమీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికతో మాట్లాడాడు.
“నా మనసులో ఒక్క విషయం మాత్రమే ఉంది. నేను ఎవరినైనా నా రోల్ మోడల్‌గా భావిస్తే, ఆ వ్యక్తి గురించి నేను ఎప్పుడూ చెడుగా మాట్లాడను. ఎవరైనా నన్ను బాధపెట్టే విధంగా మాట్లాడితే అతను నా అభిమాని, భారత జట్టు అభిమాని కాలేడు.. కాబట్టి వాస్తవానికి, అలాంటి వాళ్లు ఏమి చెప్పినా నేను పట్టించుకోను,” అన్నాడు షమీ. ఒక రోల్ మోడల్‌గా, ఒక సెలబ్రిటీగా, ఒక భారతీయ క్రికెటర్‌గా అలాంటి వారికి ప్రతిస్పందిస్తే వారికి అనవసరమైన ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళము అవుతామని షమీ తెలిపాడు. మేము దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాము, మన దేశం కోసం పోరాడుతున్నాము. కాబట్టి ఇలాంటి ట్రోల్స్ గురించి మాట్లాడటం లేదా స్పందించడం ద్వారా మనం ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదని షమీ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అక్టోబర్ 23న ICC T20 వరల్డ్ కప్ 2022 లో భాగంగా భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి.