More

    ఆఫ్ఘనిస్థాన్ ఓటమి.. సెమీస్ రేస్ నుండి భారత్ అవుట్.. ఇక తలపడే జట్లు ఏవేవి అంటే..!

    న్యూజిలాండ్ జట్టుపై ఆఫ్ఘనిస్థాన్ ఆదివారం నాడు విజయం సాధించి ఉంటే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండేది. కానీ న్యూజిలాండ్ మరో అద్భుతమైన విజయం అందుకుని సెమీస్ కు చేరిపోయింది. అబుదాబిలో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబరుస్తూ ఆఫ్ఘనిస్థాన్ పై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా గ్రూప్-2 నుంచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా… గ్రూప్-2 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి.

    మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేయగా… లక్ష్యఛేదనలో కివీస్ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 125 పరుగులు చేసి విజయభేరి మోగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. మిడిలార్డర్ లో నజీబుల్లా జాద్రాన్ ఆడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. జాద్రాన్ 48 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. 6 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. అతడి స్కోరులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. జాద్రాన్ స్కోరు తర్వాత గుల్బదిన్ నైబ్ చేసిన 15 పరుగులే రెండో అత్యధికం. కెప్టెన్ నబీ 14 పరుగులు సాధించాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, టిమ్ సౌథీ 2, ఆడమ్ మిల్నే 1, జేమ్స్ నీషామ్ 1, ఇష్ సోధీ 1 వికెట్ తీశారు.

    ఇక ఛేజింగ్ లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్‌ (28), డారియల్ మిచెల్‌ (17) ఆ జట్టుకు శుభారంభం అందించారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 40, డెవాన్ కాన్వే 36 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ 1, రషీద్ 1 వికెట్ తీశారు. ఆఫ్ఘనిస్థాన్ ఓటమి నేపథ్యంలో నేడు టీమిండియా-నమీబియా మ్యాచ్ కు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది.

    ఆదివారం జరిగిన మరో లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ స్కాట్లాండ్‌ పై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 5 విజయాలతో గ్రూప్ లో అగ్రస్థానంలో నిలిచింది. పాక్ తొలుత 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అనంతరం 190 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. గ్రూప్ 1లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్, గ్రూప్‌లో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ జరగనుండగా, గ్రూప్ 2లో మొదటి స్థానంలో ఉన్న పాక్, గ్రూప్ 1లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

    Trending Stories

    Related Stories