వన్డే సిరీస్ ను కూడా కోల్పోయిన భారత్.. విరాట్ కోహ్లీ చెత్త రికార్డు

0
776

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో ఓటమిని మరిచిపోక ముందే భారత్ కు వన్డే సిరీస్ లోనూ ఓటమి ఎదురైంది. పార్ల్ లో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. భారత్ విసిరిన 288 పరుగుల విజయలక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి ఛేదించింది. ఓపెనర్లు జేన్ మన్ మలాన్ 91, క్వింటన్ డికాక్ 78 పరుగులు చేసి తొలి వికెట్ కు 132 పరుగులు జోడించారు. కెప్టెన్ టెంబా బవుమా (35), ఐడెన్ మార్ క్రమ్ (37 నాటౌట్), రాస్సీ వాన్ డర్ డసెన్ (37 నాటౌట్) రాణించడంతో 48.1 ఓవర్లలో గెలుపును అందుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, చహల్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 71 బంతుల్లోనే 85 పరుగులు సాధించాడు. పంత్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్ 55, శిఖర్ ధావన్ 29 పరుగులు చేశారు. శార్దూల్ ఠాకూర్ 38 బంతుల్లో 40 పరుగులు, అశ్విన్ 25 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వెంకటేశ్ అయ్యర్ 22 పరుగులు చేయగా.. కోహ్లీ (0), శ్రేయాస్ అయ్యర్ (11) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షంసీ 2, మగాలా 1, మార్ క్రమ్ 1, కేశవ్ మహరాజ్ 1, ఫెహ్లుక్వాయో 1 వికెట్ తీశారు. మూడు వన్డేల సిరీస్ ను దక్షిణాఫ్రికా 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఈ నెల 23న కేప్ టౌన్ లో జరగనుంది.

కోహ్లీ ఈ మ్యాచ్ లో ఐదు బంతులు ఆడి డకౌట్‌ అయ్యాడు. వన్డేల్లో కోహ్లీ డకౌట్ కావడం ఇది 14వ సారి. వన్డేల్లో ఓ స్నిన్నర్ (కేశవ్ మహారాజ్) బౌలింగులో డకౌట్ కావడం కోహ్లీకి ఇదే తొలిసారి. ఈ డకౌట్ తో కోహ్లీ రాహుల్ ద్రావిడ్, కపిల్‌దేవ్ చెత్త రికార్డును అధిగమించాడు. వన్డేల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. సచిన్ 20 సార్లు డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా జవగళ్ శ్రీనాథ్ (20), అనిల్ కుంబ్లే (18), యువరాజ్ సింగ్ (18), హర్భజన్ సింగ్ (17), సౌరవ్ గంగూలీ (16), జహీర్ ఖాన్ (14), కోహ్లీ (14), సురేశ్ రైనా (14), వీరేంద్ర సెహ్వాగ్ (14), రాహుల్ ద్రవిడ్ (13), కపిల్ దేవ్ (13) ఉన్నారు. కోహ్లీ వరుసగా 64వ ఇన్నింగ్స్‌లోనూ శతకం లేకుండానే పెవిలియన్ చేరాడు. ఈ కాలంలో డకౌట్ కావడం ఇది ఏడోసారి.