టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన భారత్ వన్డే సిరీస్ ను కూడా ఓటమితో మొదలుపెట్టింది. భారీ లక్ష్య ఛేదనలో టాప్ ఆర్డర్ రాణించినా.. మిడిలార్డర్ విఫలమవ్వడంతో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. భారత జట్టు 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. 297 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత బ్యాట్స్ మెన్లలో కేఎల్ రాహుల్ 12 పరుగులు, ధావన్ 79, కోహ్లీ 51, రిషభ్ పంత్ 16, శ్రేయస్ అయ్యర్ 17, వెంకటేశ్ అయ్యర్ 2, అశ్విన్ 7, శార్దూల్ ఠాకూర్ 50, భువనేశ్వర్ కుమార్ 4, బుమ్రా 14 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎన్గిడి, షంషీ, పెహ్లూక్వాయోలు చెరో 2 వికెట్లను తీయగా, మార్క్రామ్, కేశవ్ మహరాజ్ లు చెరొక వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా భారీ స్కోరును సాధించింది. 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులను సాధించింది. బవుమా (110 పరుగులు, 143 బంతులు, 8 ఫోర్లు), వ్యాన్ డుస్సేన్ (129 పరుగులు నాటౌట్, 96 బంతులు, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. దక్షిణాఫ్రికా ఇతర బ్యాట్స్ మెన్లలో డీకాక్ (27), మలాన్ (6), మార్క్ రామ్ (4), మిల్లర్ (2 నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా, అశ్విన్ ఒక వికెట్ తీశాడు. 129 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన సౌతాఫ్రికా బ్యాట్స్ వ్యాన్ డుస్సేన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. రెండో వన్డే పార్ల్ వేదిక గానే శుక్రవారం నాడు జరగనుంది.