అలా భారత్ రికార్డు విజయాలకు బ్రేక్ వేసిన సఫారీలు

0
705

ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. భారత బ్యాట్స్మెన్ బాగా ఆడినా.. అంతకు మించి సఫారీ బ్యాట్స్మెన్ రాణించడంతో భారీ స్కోరును ఎంతో సునాయాసంగా ఛేదించారు. భారత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 211 ప‌రుగులు చేసింది. భార‌త ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ ఏకంగా 76 ప‌రుగులు చేయగా.. రుతురాజ్ గైక్వాడ్ 23 ప‌రుగుల‌తో ఫ‌ర‌వాలేద‌నిపించాడు. శ్రేయాస్ అయ్య‌ర్ (36), ఆ త‌ర్వాత వ‌చ్చిన కెప్టెన్ రిష‌బ్ పంత్ (29), హార్దిక్ పాండ్యా (31) రాణించారు. దక్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో కేశ‌వ్ మ‌హారాజ్‌, డేనియ‌ల్ ప్రిటోరియ‌స్‌, ఎన్రిచ్ నోర్ట‌జే, వైనీ పార్నెల్‌ల‌కు త‌లో వికెట్ ద‌క్కింది.

212 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో దిగిన ద‌క్షిణాఫ్రికా సూపర్ ఫినిషింగ్ ఇచ్చి భారత అభిమానులు అవాక్కయ్యేలా చేసింది. భారత జట్టు నిర్దేశించిన 212 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. వాన్ డుసెన్, డేవిడ్ మిల్లర్ భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. డుసెన్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 75 పరుగులు చేయగా, మిల్లర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేశాడు. ప్రిటోరియస్ 13 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. క్వింటన్ డి కాక్ 22, కెప్టెన్ తెంబా బవుమా 10 పరుగులు చేశారు. మిల్లర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

ఈ పరాజయంతో టీ20 ఫార్మాట్‌లో భారత్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. భారత్ వరుసగా 12 టీ20లను గెలిచింది. వరుసగా 13వసారి గెలుపొంది ప్రపంచ రికార్డు సృష్టించాలన్న కల నెరవేరకుండా పోయింది.