తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నివాసం ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో భాగంగా పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్దకు భారీగా తరలివచ్చారు. ఇంటి గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. రెండు వర్గాల వారిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మొహరించారు. వైసీపీ కార్యకర్తల నిరసన గురించి తెలిసి టీడీపీ కార్యకర్తలు భారీగా చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు.
గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో నిన్న మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు వర్ధంతి కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. పనికిమాలినోళ్ల పాలనకు ఏపీ అద్దం పడుతోందన్నారు. తాను అధికారంలోకి వస్తే పెంచుకుంటూ పోతానని జగన్ ఎన్నికల ముందు చెప్పారని, పెంచడం అంటే పింఛను కాదని, పన్నులని విమర్శించారు. సీఎం మద్యం, మాంసం, చేపలు అమ్ముతాడా? చెత్త, మరుగుదొడ్లపై పన్ను వేసేవాడిని అలా అనక ఇంకెలా అంటారంటూ ఓ పదాన్ని ప్రయోగించారు. తనపై ఎన్ని కేసులు పెట్టుకుంటారో, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. సన్నబియ్యం అంటే తెలియనోడు పౌరసరఫరాల శాఖ మంత్రి అని, ఇరిగేషన్ మంత్రి బెట్టింగు రాయుడని పేర్కొన్న అయ్యన్న.. లేని దిశ చట్టంతో ఉరిశిక్ష, జీవితఖైదు వేస్తామంటున్న హోం మంత్రిని చూస్తుంటే జాలేస్తోందన్నారు. లేని చట్టం కోసం రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారని జగన్ ను ఉద్దేశించి మరోమారు తీవ్ర పద ప్రయోగం చేశారు. హోంమంత్రికి సిగ్గు, లజ్జ ఉంటే తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సినిమా వాళ్ల బ్లాక్ టికెట్లు కూడా అమ్ముతామంటున్నారని, ఇంటింటికి మల్లెపూలు అమ్ముకునే వ్యాపారం కూడా ప్రారంభించి దానికి అంబటి రాంబాబును అధ్యక్షుడిని చేయాలని అయ్యన్న సూచించారు.
అయ్యన్నపాత్రుడిపై వైసీపీ ఎమ్మెల్యేలు జోగి రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. పొద్దున లేస్తే చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు చేసేది గంజాయి వ్యాపారమని.. రెండున్నరేళ్లుగా ఆ వ్యాపారం బంద్ అయ్యేసరికి వారిద్దరూ గాడిదల్లా అరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడి పేరులో అన్నం ఉందిగానీ.. నోట్లో అంతా అశుద్ధమేనని, ఇకపై ఆయన్ను అశుద్ధంపాత్రుడుగా పిలవాలని అన్నారు. ఆయన గురించి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా నీచంగా చెబుతారన్నారు. చంద్రబాబు హయాంలో అయన్నపాత్రుడు కోట్లాది రూపాయల ప్రజధనాన్ని దోచుకున్నారని, చంద్రబాబు అవినీతిని బయటపెడుతున్నందుకే ప్రభుత్వంపై దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబు కారణమో కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు సిగ్గులేదని… అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన తెలియజేయడానికి వచ్చిన తమపై దాడి చేస్తారా? అని మండిపడ్డారు. గూండాలు, చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు కలిసి దాడికి పాల్పడ్డారని అన్నారు. ఇంట్లో పడుకోవడం కాదు చంద్రబాబూ… దమ్ముంటే బయటకు రా.. మా సత్తా ఏమిటో చూపిస్తామని జోగి రమేశ్ సవాల్ విసిరారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా మంటగలిసిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను జగన్ ఆఫ్ఘనిస్తాన్ గా మార్చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు నివాసంపై వైసీపీ గూండాలు దాడికి యత్నించడం దారుణమైన చర్య అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై మాట్లాడితే తప్పా? అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను లేవదీస్తే గూండాగిరి చేస్తారా? అని ప్రశ్నించారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు ఇంటిపై రౌడీ మూకను వేసుకొచ్చి రాళ్లతో దాడి చేస్తారా? అని నిలదీశారు. జోగి రమేశ్ ఎమ్మెల్యేనా లేక గూండానా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.