ఆంధ్రప్రదేశ్‌లో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటిని టీడీపీ కైవసం చేసుకుంది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు కైవసం చేసుకున్నారు. తూర్పు రాయలసీమ శాసనమండలి గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ స్థానంలో మాత్రం హోరాహోరీ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర స్థానంలో విజయం సాధించిన చిరంజీవిరావు విజయానికి అవసరమైన ఓట్లలో 90 శాతం తొలి ప్రాధాన్యత ఓట్లలో సాధించగా మిగిలినవి రెండో ప్రాధాన్యత ఓట్లు రావడంతో ఆయనకు విజయం దక్కింది. విజయానికి 94,509 ఓట్లు అవసరం కాగా, తొలి ప్రాధాన్యంలో 82,958, రెండో ప్రాధాన్యంలో 11,551 ఓట్లు సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి చిరంజీవిరావుకు మొత్తం 1,12,686 వచ్చాయి. తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపొందారు. రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి శ్రీకాంత్ 1,12,686 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్‌రెడ్డికి 85,423 ఓట్లు వచ్చాయి.
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. మొత్తం 11 రౌండ్లు పూర్తయ్యాయి. మొత్తం 2,45,576 ఓట్లు పోలవగా ఇందులో వైసీపీ బలపరిచిన వెన్నపూస రవీంద్రారెడ్డికి 95,969, టీడీపీ బలపరిచిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 94,149 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ గెలుపుకు సరిపడిన ఓట్లు రానందువలన రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.