ఏపీ సీఎం వైఎస్.జగన్ నయా హిట్లర్ అని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ మాదిరిగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గపు, ఫ్యాక్షనిస్టు పాలన జరుగుతోందని విమర్శించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని రామకృష్ణారెడ్డి పరామర్శించారు. టీడీపీ నాయకులు ప్రజాసమస్యలపై పోరాటం చేస్తే అరెస్టులు, దాడులు చేస్తున్నారని ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వంలో అధికారపక్షం, ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రతిపక్షం ఎత్తి చూపిస్తే, వాటిని సరిచేసుకోవాల్సి ఉంటుందని, దానికి భిన్నంగా కేసులు నమోదు చేయించి, దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ క్షణంలో ఎన్నికలొచ్చినా తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.