More

    సీఎం వైఎస్ జగన్ లండన్ ఎందుకు వెళ్లారో.. టీడీపీ ప్రశ్నల వర్షం

    వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌ దావోస్‌ చేరుకున్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు అక్కడ డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు లో పాల్గొననుంది. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి ఈ సదస్సులో విస్తృతంగా చర్చిస్తారు. ఇందుకోసం పలువురు ఉన్నతాధికారులతో కలిసి సీఎం జగన్‌ దావోస్‌ వెళ్లారు.

    దావోస్ కు పయనమైన వైఎస్ జగన్ లండన్ కు వెళ్లారంటూ వార్తలు వస్తున్నాయి. అధికారులతో కలిసి అధికారిక పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్… తన భార్య భారతితో కలిసి లండన్ కు వెళ్లారని చెపుతున్నారు. ప్రత్యేక విమానంలో జగన్, భారతి, మరో వ్యక్తి మాత్రమే లండన్ కు వెళ్లారని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. జగన్ లండన్ కు వెళ్లడం వెనకున్న మిస్టరీ ఏమిటని ప్రశ్నించారు. దావోస్ కు వెళ్లాలనుకున్నది రాష్ట్రం కోసమా? లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? అని అడిగారు. దోచుకున్న అవినీతి సంపదను దాచుకోవడానికే వెళ్లారా? అని ప్రశ్నించారు. లండన్ కు వెళ్లాలనుకుంటే అధికారికంగానే వెళ్లొచ్చని… చాటుమాటుగా వెళ్లాల్సిన అవసరం ఏముందని అన్నారు. అధికారులను వదిలేసి భార్యతో కలిసి లండన్ కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. వ్యక్తిగత పనులకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.

    టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు వైఎస్ జగన్ అత్యంత ఖర్చు ఉండే విమానంలో వెళ్లార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ”జగన్ రెడ్డి దావోస్ అని బయలుదేరిన స్పెషల్ ఫ్లైట్ ఎంబ్రేయర్ లినీయ‌జ్‌ 1000. ప్రపంచ టాప్ 50 కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ ఇది. దీని ఖర్చు, గంటకు 14,500 డాలర్లు. అంటే గంటకు రూ.12 లక్షలు. జగన్ రెడ్డి దావోస్ అని చెప్పి, లండన్ లోని లుటన్ ఎయిర్ పోర్ట్ లో దిగారని తెలుస్తోంది. లండన్ కు దాదాపుగా 13-14 గంటల సమయం. దాదాపుగా కోటిన్నర కేవలం ఫ్లైట్ ఖర్చు. ఇక లండన్ లోని లుటన్ ఎయిర్ పోర్ట్, కేవలం ప్రైవేట్ ఎయిర్ పోర్ట్. ధనవంతులు మాత్రమే దిగే చోటు. ఇక్కడ పార్కింగ్ ఫీజ్, ప్రపంచ కుబేరులు మాత్రమే భరించగలరు. లావిష్ ఫ్లైట్ లో, రాయల్ గా, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి వెళ్తున్నాడు జగన్ రెడ్డి.” అని అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు.

    Trending Stories

    Related Stories