More

    వరుసగా ఐదోసారి.. ఏపీ అసెంబ్లీ నుంచి ఆ 11మంది సస్పెండ్..!

    ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. మొత్తం 11 మందిని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, చినరాజప్ప, బెందాళం అశోక్, గణబాబు, వెలగూపూడి, మంతెన రామరాజు, సాంబశివరావు, గొట్టి రవికుమార్, బాలవీరాంజనేయ, గద్దె రామ్మోహన్‌ను సస్పెండ్ చేయాలంటూ బుగ్గన సూచించడంతో స్పీకర్ ఈ మేరకు వారిని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. క్వశ్చన్ అవర్ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనపై చర్చ జరగాలని పట్టుబట్టారు. టీడీపీ సభ్యుల ప్రతిపాదన సభా సంప్రదాయాలకు విరుద్ధమని శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. సభా సమయాన్ని వృథా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనల గురించీ చర్చించాలంటూ వైసీపీ సభ్యులు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం మొదలైంది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తమ నిరసన తెలియజేశారు. ఆ తరువాత టీడీపీ సభ్యుల్లో కొందరు స్పీకర్ చైర్ వద్దకు వెళ్లి తమ ఎజెండా కాపీలను చింపి నిరసన తెలిపారు. మంత్రి బుగ్గన సభా సమయాన్ని వృథా చేయడం సరికాదని టీడీపీ సభ్యులకు మరోసారి సూచించారు. టీడీపీ సభ్యులు తగ్గకపోవడంతో.. వారిని సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన ప్రతిపాదించగా.. స్పీకర్ ఆమోదముద్ర వేశారు. టీడీపీ సభ్యులు సస్పెండ్ కావడం ఇది వరుసగా అయిదోసారి.

    Trending Stories

    Related Stories