ఏపీ అసెంబ్లీలో విజిల్స్ వేసిన టీడీపీ సభ్యులు

0
872

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గంద‌ర‌గోళం కొనసాగుతూనే ఉంది. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో ఆ పార్టీకి చెందిన నలుగురు స‌భ్యుల‌ను స‌భ నుంచి స‌స్పెండ్ చేశారు. ఈ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా ప‌డే వ‌ర‌కు (ఈ నెల 25 వ‌ర‌కు) వారిపై స‌స్పెన్ష‌న్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. స‌స్పెన్షన్ వేటు ప‌డిన వారిలో అశోక్‌, రామ‌రాజు, స‌త్య‌ప్ర‌సాద్, రామ‌కృష్ణ ఉన్నారు.

ఇక సభలో తెలుగుదేశం పార్టీ సభ్యులు విజిల్స్ వేయడం వివాదాస్పదమైంది. ఏకంగా మూడుసార్లు విజిల్ వేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం వారిస్తున్నప్పటికీ మళ్లీ, మళ్లీ విజిల్ వేశారు తెలుగుదేశం పార్టీ సభ్యులు. దీనితో స్పీకర్ ఘాటుగా హెచ్చరించారు. బయటికెళ్లి ఇష్టం వచ్చినట్లు చేసుకోండన్నారు. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సబ్సిడీని అమలు చేయడం వల్ల డిస్కమ్‌లపై పడుతోన్న భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. ఆ సమయంలో టీడీపీకి చెందిన విజయవాడ తూర్పు నియోజకవర్గం సభ్యుడు గద్దె రామ్మోహన్ రావు విజిల్ వేశారు. దీనితో బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలో ఆపి వేశారు. మళ్లీ ప్రసంగాన్ని ఆరంభించబోతోండగా మరోసారి విజిల్ వేశారాయన. దీనితో స్పీకర్ తమ్మినేని జోక్యం చేసుకున్నారు. సీనియర్ సభ్యుడివి అయివుండీ ఇలా ప్రవర్తించడం సరికాదని మార్షల్స్‌ను పిలిపించారు. ఇదేమైనా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్ వారిస్తోన్న సమయంలోనే మళ్లీ విజిల్ వేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సభలో విజిల్స్ వేయడం సరికాదని అన్నారు స్పీకర్. ఇది కరెక్ట్ కాదని తీవ్ర స్వరంతో చెప్పారు. సభ నుంచి బయటికి వెళ్లి ఏవైనా చేసుకోండని స్పీకర్ వారికి సూచించారు. సభ బయటికి వెళ్లి విజిల్స్ వేసుకుంటారో.. బాంబులు వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి.. అని అన్నారు.

ఈ ప‌రిణామాల‌పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ సభ సంప్రదాయాలకు భిన్నంగా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. విజిల్స్, కేకలు వేయడం స‌రికాద‌ని అన్నారు. వారి తీరు చూస్తుంటే వారు స‌భ‌లో ఏయే ఆయుధాలు తీసుకువచ్చారో చెక్‌ చేయాల్సిన అవసరం ఉందని ఆయ‌న చెప్పారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న టీడీపీ సభ్యులపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్పీకర్‌ చైర్‌కు వైపున‌కు వేలు చూపిస్తూ మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకే శాసనసభలోకి ఆ పార్టీ స‌భ్యులు విజిల్స్‌ తీసుకువచ్చార‌ని అన్నారు.