టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పట్టాభి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్రం భగ్గుమంది. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఓ పదాన్ని ఉపయోగించడంతో వైసీపీ నాయకులు, కేడర్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. పరిస్థితులు అదుపుతప్పింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా దాడులకు దిగే వరకు వచ్చింది.
పోలీసులు అరెస్టు చేయగా.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు. రిమాండ్ ఖైదీగా ఉన్న పట్టాభికి ఏపీ హైకోర్టు ఆయనకు శనివారం బెయిల్ ఇచ్చింది. పట్టాభి ఎయిర్‌పోర్టులో, ఫ్లైట్‌లో ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దేశం వదిలి వెళ్లిపోతున్న పట్టాభి అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. పట్టాభి మాల్దీవుల పర్యటనకు వెళ్లారని తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లినట్టు తెలిసింది. పట్టాభికి బెయిల్ ఇచ్చేటప్పుడు న్యాయస్థానం ఎలాంటి షరతులు విధించనందున ఆయనకు ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉందని న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ తెలిపారు.

తెలుగుదేశం పార్టీపై జరిగిన దాడులను రాష్ట్రపతి దృష్టికి తీసుకుని వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై జరిగిన దాడులపై సీబీఐతో విచారణ జరిపించి, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరామని చంద్రబాబు తెలిపారు. ఏపీలో పరిస్థితులు మరింత ఘోరంగా తయారవకముందే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్రపతిని కోరామని చెప్పారు. ఏపీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని చెప్పినందుకే దాడులు చేశారని.. దాడి చేసిన వెంటనే డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదని మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పేట్రేగిపోతోందని అన్నారు. డ్రగ్స్ వల్ల రాష్ట్రంలో యువత నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలన ఉందని చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలపై కూడా దాడులు చేస్తున్నారని అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైకోర్టు జడ్జీలతో పాటు ఇతర రంగాలపై దాడులు చేశారని అన్నారు. రాష్ట్ర సహజ సంపదను, వనరులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. నానాటికీ రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారవుతోందని అన్నారు.
చంద్రబాబు ఢిల్లీ టూర్ పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ రాష్ట్ర యువతపై డ్రగ్స్ నెపం మోపుతూ రాష్ట్ర పరువు తీయడానికే బాబు ఢిల్లీ వెళ్లాడని అన్నారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడి పెద్దలను కూడా క్యారే బోసడీకే అనే పిలుస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఆ పదం ఢిల్లీలో వాడితే చెప్పుతో కొడతారని అన్నారు. గతంలో ప్రధాని మోదీని తిట్టిన సీడీలు చూపించడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడా? లేక తిరుపతిలో అమిత్ షాపై రాళ్ల దాడి చేసిన వీడియోలు చూపించడానికి ఢిల్లీ వెళ్లాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు మత, కుల రాజకీయాలు అయిపోయి, కొత్తగా డ్రగ్స్ రాజకీయాలు తెస్తున్నాడని విమర్శించారు.