Telugu States

టీడీపీ నేత పట్టాభి.. ఏపీ ముఖ్యమంత్రిపై ఏమని వ్యాఖ్యలు చేశారు..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలే.. ఆయన ఇంటిపై దాడులకు కారణమని చెబుతున్నారు. ఇంతకూ పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఘాటు వ్యాఖ్యలు ఏమిటంటే..! ఏపీలో గంజాయి వ్యాపారానికి, వైసీపీ నేత‌లు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ముడిపెడుతూ మంగళవారం నాడు మంగ‌ళ‌గిరిలో టీడీపీ కార్యాల‌యంలో ప‌ట్టాభి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయ‌లేని భాష‌లో జ‌గ‌న్‌పై తిట్ల పురాణాన్ని ప్ర‌ద‌ర్శించారు. ‘రేయ్‌, బోసిడీకే’ అంటూ ప‌ట్టాభి వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు పోలీసులు నోటీసులు అందించడంపై పట్టాభి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ పాలేరు ఆడమన్నట్టు పోలీసులు ఆడతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లకు కొమ్ము కాస్తుందని.. ఏపీ గంజాయికి అడ్డాగా మారిందని అన్నారు. అలాంటి పరిస్థితి లేకుంటే తెలంగాణ, తమిళనాడు పోలీసులు గంజాయి స్మగ్లర్లని పట్టుకోవడానికి ఏపీకి ఎందుకు వచ్చారని పట్టాభి ప్రశ్నించారు.

ముఖ్య‌మంత్రిపై ప‌ట్టాభి దుర్భాష‌కు నిర‌స‌న‌గా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాల‌యాలు, ముఖ్య నాయ‌కుల ఇళ్ల‌పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్ప‌డి త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశాయి. విజ‌య‌వాడ‌లో ప‌ట్టాభి ఇల్లు, మంగ‌ళ‌గిరిలో టీడీపీ కేంద్ర కార్యాల‌యం, విశాఖ‌లో టీడీపీ కార్యాల‌యం, చిత్తూరు జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో రేణిగుంట‌లో టీడీపీ ఇన్‌చార్జ్ సుధీర్‌రెడ్డి మరికొన్ని ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు దాడికి పాల్ప‌డ్డాయి.

తన నివాసంపై జరిగిన దాడి ఘటన గురించి టీడీపీ నేత పట్టాభి స్పందించారు. ఇంత మంది పోలీసులు ఉండి ఏం లాభమని, తనను ఎప్పుడు చంపాలా అని ఎదురు చూస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందే చెబితే… తాను అందుకు సిద్ధంగా ఉండేవాడినంటూ తన భార్య, బిడ్డలు ఏం‌ పాపం చేశారని ప్రశ్నించారు. ఇంటి మీద పడి ఇంత రాక్షసంగా చేస్తారా? ప్రభుత్వ లోపాలని ప్రశ్నిస్తే చంపేస్తారా… అని నిలదీశారు. చనిపోవడానికి కూడా సిద్దం.. చంపేయండని సవాల్ విసిరారు.

ఈ దాడులపై పలువురు నేతలు ఖండించారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఈ సంఘటనలు విషాదకరం అని అభివర్ణించారు. ఇటువంటి దమనకాండకు పాల్పడిన వ్యక్తులపై జగన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని ఏపీ బీజేపీ తరఫున డిమాండ్ చేశారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, జనసేన ఐటీ వింగ్ కు సంబంధించిన సమావేశంలో ఉండగా రాష్ట్రంలో టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగినట్టు సమాచారం అందిందని తెలిపారు. తనకు తెలిసినంతవరకు రాష్ట్రంలో పార్టీ ఆఫీసులపై దాడులు జరగడం ఇదే ప్రథమం అని.. ఇలాంటి దాడుల సంస్కృతి ప్రజాసంక్షేమానికి ఏమాత్రం క్షేమకరం కాదని అన్నారు. పార్టీ ఆఫీసులపైనా, నాయకుల ఇళ్లపైనా దాడులు చేస్తే అది అరాచకానికి, దౌర్జన్యానికి దారితీస్తుంది తప్ప, అది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదని పవన్ అభిప్రాయపడ్డారు. ఏపీ పోలీసు విభాగం కూడా సత్వరమే దీనిపై చర్యలు తీసుకోవాలని, దోషులను పట్టుకుని శిక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ అరాచకానికి చిరునామాగా మారుతుందని స్పష్టం చేశారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ… టీడీపీ కార్యాలయాలపైనా, ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపైనా దారుణరీతిలో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దాడికి పాల్పడినవారు పట్టాభి కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా దూషించినట్టు తెలిసిందని.. ఈ దాడులకు కారకులు ఏ పార్టీకి చెందినవారైనా సరే డీజీపీ తక్షణమే చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేయాలని రఘురామ డిమాండ్ చేశారు.

Related Articles

Back to top button