గుంటూరు జిల్లా అనమర్లపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మట్టి తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను గ్రామస్థులు అడ్డుకున్నారు. అయితే ఇది వైసీపీ కార్యకర్తల పనే అని టీడీపీ ఆరోపిస్తోంది. అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారంటూ టీడీపీ ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అక్కడకు వెళ్లారు. అక్కడ అడ్డుకుని ఆయన కారుపై దాడికి దిగారు. ధూళ్లిపాళ్ల నరేంద్ర మట్టి తవ్వకాల పరిశీలనకు వెళ్లకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా, ఆయన వచ్చిన కారును కూడా ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమతితో మట్టి తవ్వుతుంటే అక్రమ క్వారీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ పెట్టేందుకే ఇక్కడకు వచ్చారా అంటూ దూళిపాళ్లను నిలదీశారు. టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో ఎన్నో అక్రమాలు చేశారని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడకు వచ్చారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దూళిపాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే స్పందించిన ధూళిపాళ్ల నరేంద్ర.. అక్రమాలను ప్రశ్నిస్తే మీకేందుకు భయం అని వైసీపీ శ్రేణులను ప్రశ్నించారు.