More

    చింతకాయల అయ్యన్నపాత్రుడి అరెస్ట్

    తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అంతకుముందు నర్సీపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న సీఐడీ పోలీసులు.. అయ్యన్నకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్న ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన అంశంలో అయ్యన్న ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ తెల్లవారుజామున ఆయన ఇంటికి చేరుకుని నోటీసులు అందజేసి అరెస్ట్ చేశారు. ఏలూరు కోర్టులో ఆయనను హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.

    అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. జగన్ ముఖ్యమంత్రిలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని.. గోడలు దూకి, తలుపులు బద్దలుగొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బీసీ నేత అయిన అయ్యన్న, ఆయన కుమారుడిని అరెస్ట్ చేయడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. చింతకాయల విజయ్‌పై కేసు విషయంలో సీఐడీ విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదని అన్నారు. పోలీసులు దొంగల్లా ఇళ్ల మీద పడి అరెస్టులు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు గతంలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. వైసీపీ ఉత్తరాంధ్ర దోపిడీని ప్రశ్నిస్తున్న బీసీ నేతల గళాన్ని అణచివేసేందుకే కేసులు, అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతికి చంద్రబాబు ఫోన్ చేశారు. అయ్యన్నకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

    Trending Stories

    Related Stories