ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తాజాగా రూ.1.50 కోట్లతో బెంజ్ కారు కొన్నారు. తన కుమారుడు కౌశిక్ కోసమే ఈ కారును కొన్నానని తెలిపారు. మంత్రి రోజా కారును కుమారుడితో కలిసి ఆవిష్కరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై టీడీపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శలు గుప్పించింది. మంత్రి గారికి అపాయింట్మెంట్ లో బాగానే వస్తున్నట్టు ఉన్నాయి.. బాగానే వెనకేసారు.. అంటూ రోజా వీడియోపై టీడీపీ కామెంట్ చేసింది. రోజా కొన్న జీఎల్ఎస్- 400డీ బెంజ్ కారు విలువ రూ.1.5 కోట్లని కూడా టీడీపీ వెల్లడించింది. జగన్ కేబినెట్లో రోజా, విడదల రజనీలను కరప్షన్ క్వీన్లుగా పేర్కొంది. ఈ ఇద్దరు మంత్రులు తమతో అపాయింట్ మెంట్ కోసం వస్తున్న వారి వద్ద రూ.50 వేల చొప్పున వసూలు చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపణలు గుప్పించింది.
ఏపీ మంత్రి ఆర్కే రోజా గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎంలకు ర్యాంకింగ్ ఇస్తూ చేసిన సర్వేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన సర్వే చేశారో వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. పది రోజుల క్రితం ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన వ్యక్తికి ఐదో ర్యాంకు ఇచ్చి, మూడేండ్లుగా నిరంతరాయంగా ప్రజల కోసం పరితపిస్తూ సంక్షేమ పథకాలు తెస్తున్న సీఎం జగన్‌కు అట్టడుగు ర్యాంకు ఇవ్వడమేంటని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి సర్వేలన్నీ బోగస్ బాబు చంద్రబాబు చేయిస్తారని, ఆయన చేయించే సర్వేలన్నీ బోగస్ సర్వేలే అని రోజా విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబు ఇలాంటి జిమ్మిక్కులు చాలానే చేస్తాడని.. చిన్న మెదడు చిట్లిపోయిన చంద్రబాబు, లోకేష్‌లను త్వరగా మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు.