అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తా తుపాను అతి తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. గుజరాత్ వైపుగా తౌక్తా తుపాను పయనిస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 18 ఉదయాన పోరుబందర్, మహువా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా గుజరాత్ లో రెండు రోజుల పాటూ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిలిపివేశారు. గుజరాత్ రాష్ట్రానికి ప్రస్తుతానికి ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. సౌరాష్ట్ర, కచ్, డయ్యూ ప్రాంతాల్లో మే 17న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మే 18న కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి తప్పదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

తుపాను కారణంగా ముంబైను కారు మబ్బులు చుట్టుముట్టాయి. ఓ మోస్తరుగా వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 50కు పైగా ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలు గుజరాత్ కు పంపామని ఎన్.డి.ఆర్.ఎఫ్. డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్.ప్రధాన్ తెలిపారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో గోడలు కూలడం వలన కొందరు చనిపోయారని.. అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు.
కేరళలోని చాలా ప్రాంతాల్లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుపాను కారణంగా గోవాకు అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు. గోవా విమానాశ్రయాన్ని మూసి వేశారు. గోవాలో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. భారీ వర్షాలు, బలమైన గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళలో అనేక డ్యాములు పొంగిపొర్లుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.

ప్రస్తుతం అతి తీవ్ర తుపానుగా కొనసాగుతున్న తౌక్తా గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనిస్తోంది. ఆపై ఉత్తర వాయవ్య దిశగా పయనించి గుజరాత్ తీరాన్ని సమీపిస్తుంది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అలలు 3 మీటర్ల ఎత్తున ఎగసిపడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.