టాటా గ్రూప్ గొప్ప నిర్ణయం.. దేశంలో ఎన్నో కంపెనీలు ఉన్నా వీరు ప్రత్యేకమే

0
1010

టాటా గ్రూప్.. ఈ కంపెనీ తీసుకునే నిర్ణయాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. గతంలో రతన్ టాటా తీసుకున్న నిర్ణయాల గురించి ఇప్పటికీ ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కంపెనీ తమ ఉద్యోగులతో ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉంటుందని మరోసారి రుజువైంది.

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కుటుంబంలో సంపాదించే వాళ్లు చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. ఎందరో జీవితాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి దెబ్బకు ఎంతో మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని సంస్థలు కాస్త డబ్బు ఇచ్చి చేతులు దులుపేసుకుంటూ ఉన్నాయి. ఇక ప్రభుత్వాలు ఎంత సహాయం చేస్తాయో తెలియని పని.

దేశంలో ఎన్నో కంపెనీలు ఉన్నా.. తమ సంస్థ మాత్రం చాలా ప్రత్యేకమని టాటా గ్రూప్ మరో సారి నిరూపించుకుంది. కరోనా మహమ్మారితో చ‌నిపోయిన త‌మ సంస్థ ఉద్యోగ కుటుంబాలకు స‌ద‌రు ఉద్యోగి రిటైర్మెంట్ వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు ఆ ఉద్యోగి నెల జీతాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు ఇవ్వ‌నున్న‌ది. ఉద్యోగి 60 ఏళ్ల వ‌య‌సు వ‌ర‌కు ఆ ఉద్యోగి కుటుంబ‌స‌భ్యులకు నెల జీతం ఇవ్వ‌నున్నారు. ఆ ఉద్యోగి చివ‌రిసారి ఎంత జీతం తీసుకున్నప్పుడు మరణించారో.. ఆ జీతాన్ని ప్ర‌తి నెల వారి కుటుంబ‌స‌భ్యుల‌కు ఇవ్వ‌నున్న‌ట్లు టాటా స్టీల్ తెలిపింది. టాటా కంపెనీలో ప‌నిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్ కు కోవిడ్ సంక్ర‌మించి, ఆ వ్య‌క్తి ఒక‌వేళ మ‌ర‌ణిస్తే.. ఆ ఉద్యోగి పిల్ల‌ల చ‌దువుల‌ను మొత్తం కంపెనీ భ‌రించ‌నున్న‌ది. అలాగే చనిపోయిన వ్యక్తి నెల జీతం కూడా ఇస్తూ ఉంటారు. పిల్ల‌లు భారతదేశంలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి అయ్యేంత వ‌ర‌కు ఆ మొత్తం ఖ‌ర్చును టాటా స్టీల్ కంపెనీ భరించనుంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ ను తమ సోషల్ మీడియా ఖాతాలో టాటా స్టీల్ వెల్లడించింది.

‘Agility With Care’ అంటూ టాటా సంస్థ కోవిద్-19 కారణంగా మరణించిన కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. నిన్న-నేడు-రేపు మీతోనే ఉంటామని మాటిస్తున్నామని టాటా స్టీల్ తెలిపింది. కరోనా కారణంగా ఉద్యోగులు మరణించడం తమకు తీవ్ర బాధను కలిగించిందని.. ఉద్యోగి కుటుంబాలకు అండగా ఉంటామని టాటా స్టీల్ తెలిపింది. ఉద్యోగి కుటుంబాలకు హెల్త్ బెనిఫిట్స్ కూడా అందిస్తామని భరోసా ఇచ్చింది.

కోవిద్ పై పోరాటానికి టాటా సహాయం:

కరోనా మహమ్మారితో భారత్ పోరాడుతూ ఉంటే.. టాటా గ్రూప్ తమ తోడ్పాటును అందించింది. 2020 సంవత్సరంలో 500 కోట్ల రూపాయలను కరోనా సహాయ నిధికి అందించింది. ఏప్రిల్ 2021న భారతదేశం ఆక్సిజన్ కొరతతో అల్లాడుతూ ఉంటే టాటా గ్రూప్ ఆక్సిజన్ ను దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసింది. ఏప్రిల్ 1 మే 18 మధ్య కంపెనీ 30,000 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ను సరఫరా చేసింది. ఏప్రిల్ నెలలో 14 క్రయోజనిక్ కంటైనర్లను దిగుమతి చేసుకుంది.

26/11 అటాక్స్ జరిగిన రెండు వారాల తర్వాత రతన్ టాటా ప్రత్యేకంగా తాజ్ పబ్లిక్ సర్వీస్ వెల్ఫేర్ ట్రస్టును ఏర్పాటు చేశారు. టెర్రర్ అటాక్స్ లో నష్టపోయిన వారికి కూడా అండగా నిలుస్తూ ఉన్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు, దేశంలో బాంబ్ బ్లాస్ట్స్ వంటి వాటిలో ప్రాణాలను కోల్పోయిన వారికి అండగా నిలుస్తోంది రతన్ టాటా ఏర్పాటు చేసిన ట్రస్ట్. ఇక ఎన్నో గుప్త దానాలను కూడా టాటా గ్రూప్ చేస్తూ ఉంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

5 × 5 =