ఎయిర్ ఇండియా ను టాటా సన్స్ సొంతం చేసుకుంది. ఎయిర్ ఇండియాను కేంద్రం అమ్మకానికి పెట్టగా స్పైస్ జెట్‌తో పాటు ఎయిర్ ఇండియా కూడా బిడ్‌ను దాఖలు చేసింది. రెండు బిడ్లను పరిశీలించిన కేంద్ర మంత్రుల బృందం చివరకు టాటా సన్స్‌కే మొగ్గు చూపింది. ఎయిర్ ఇండియాను సొంతం చేసుకునేందుకు టాటా సన్స్ రూ. 18,000 కోట్లను వెచ్చించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) కార్యదర్శి తహిన్ కాంత పాండే అధికారికంగా ప్రకటించారు. స్వాతంత్ర్యానికి ముందు ఎయిరిండియాను టాటా గ్రూప్ నిర్వహించేది. జేఆర్డీ టాటా 1932లో ఎయిరిండియాను స్థాపించారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎయిరిండియాను జాతీయం చేశారు. అప్పటి నుండి ఎయిరిండియా ప్రభుత్వ రంగ సంస్థగా మారిపోయింది. 1990లు, 2000ల దాకా ఎయిరిండియా ఆధిపత్యం కొనసాగినా ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా రంగంలోకి దిగడం మొదలయ్యాక క్రమంగా ప్రాభవం తగ్గుతూ వచ్చింది. ఎట్టకేలకు తిరిగి ఎయిర్ ఇండియా టాటా చేతుల్లోకి వెళ్ళిపోయింది. తీవ్ర నష్టాలలో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ లాభాల్లోకి తీసుకు వస్తుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.
ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోవడంతో ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. దీంతో వేలంపాట నిర్వహించడానికి బిడ్స్ కూడా వేశారు. కొద్దిరోజుల కిందట ఎయిర్ ఇండియా టాటాల చేతిలోకి వెళ్లిందనే వార్తలు వచ్చాయి. 68 ఏళ్ల తర్వాత ఎయిరిండియా మళ్లీ టాటాల పరమైందంటూ జాతీయ మీడియాలో అప్పుడు కథనాలు వచ్చాయి. కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి సోషల్ మీడియాలో కొద్దిరోజుల క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం అధికారికంగా ఎయిర్ ఇండియా టాటా సన్స్ చేతుల్లోకి వెళ్లిందని కేంద్ర ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చేసింది.
2020 మార్చి 31 నాటికి ఎయిరిండియాకు దాదాపు రూ. 45,863.27 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఎయిరిండియాను నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతి రోజు దాదాపు రూ. 20 కోట్ల భారం పడుతోంది. ఎయిర్ ఇండియాను 2018లోనే కేంద్రం అమ్మకానికి పెట్టగా అప్పట్లో ఎవరూ కొనలేదు. ఈసారి వంద శాతం వాటాలను విక్రయించాలని కూడా నిర్ణయించింది. ఎయిర్ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూపుతో పాటు స్పైస్ జెట్ సంస్థలు ఆసక్తి చూపాయి.