2022లో నిర్వహించే ఐపీఎల్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

0
738

ఐపీఎల్ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్-2022 సీజన్ మార్చి 26 నుంచి జరగనుంది. ఫైనల్ మ్యాచ్ ను మే 29న నిర్వహిస్తారు. కరోనా టెన్షన్ లేకుండా.. 2022 సీజన్ ముంబయి, పూణే నగరాల్లోని 4 వేదికల్లోనే మ్యాచ్ లు జరపాలని నిర్ణయించారు. ఈ సీజన్ లో మొత్తం 10 జట్లు ఆడనుండగా, 70 లీగ్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడుతుంది. ప్లే ఆఫ్ మ్యాచ్ ల వేదికలను తర్వాత ప్రకటిస్తారు. లీగ్ మ్యాచ్ లను ముంబయిలోని వాంఖెడే, డీవై పాటిల్, బ్రాబౌర్న్ స్టేడియంలలోను, పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలోనూ నిర్వహిస్తారు.

ఈ ఏడాది ఐపీఎల్ లో కొత్తగా రెండు జట్లు వచ్చి చేరిన కారణంగా మొత్తం 10 జట్లు అయ్యాయి. ఐపీఎల్ లో ఆయా జట్లను రెండు వర్చువల్ గ్రూపులుగా విభజించారు. ఒక్కో జట్టు ఐపీఎల్ లో ఎన్ని టైటిళ్లు గెలిచిందన్న గణాంకాల ఆధారంగా వాటికి గ్రూపుల్లో స్థానాలు కేటాయించారని తెలుస్తోంది. గ్రూప్-ఏలో ముంబయి (5 టైటిళ్లు), కోల్ కతా (2), రాజస్థాన్ రాయల్స్ (1), ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో చెన్నై సూపర్ కింగ్స్ (4 టైటిళ్లు), సన్ రైజర్స్ హైదరాబాద్ (1), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి. ఒక్కో జట్టు తమ గ్రూపులోని జట్లతో రెండేసి సార్లు తలపడుతుంది. ఎదుటి గ్రూపులో తన ర్యాంకుకు సమానంగా ఉన్న జట్టుతో రెండు మ్యాచ్ లు, ఆ గ్రూపులోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఉదాహరణకు గ్రూప్-ఏలో టాప్ లో ఉన్న ముంబయి జట్టు తన గ్రూప్ లో అన్ని జట్లతో రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. అదే సమయంలో, గ్రూప్-బిలో టాప్ లో ఉన్న చెన్నై జట్టుతో ముంబయి రెండు మ్యాచ్ లు ఆడి, ఆ గ్రూప్ లో ఉన్న మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి జట్టు తన వ్యతిరేక గ్రూపులో తన ర్యాంకుకు అత్యంత చేరువలో ఉన్న జట్టుతో ఇదే విధంగా రెండు మ్యాచ్ లు, మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.

టోర్నమెంట్‌ను ఆదివారం, మార్చి 27 నుంచి ప్రారంభించాలని బోర్డు ముందుగా కోరుకుంది. కానీ శనివారం ఒక మ్యాచ్ తో.. ఆదివారం రెండు మ్యాచ్ లతో టోర్నమెంట్‌ను ప్రారంభించాలని స్టార్ ఇండియా కోరింది.లీగ్ దశలోని అన్ని మ్యాచ్‌లను మహారాష్ట్రలోనే నిర్వహించేందుకు బోర్డు అంగీకరించింది. త్వరలోనే టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించే విషయమై కూడా బోర్డు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది.