ఎయిరిండియా అధికారికంగా టాటా గ్రూప్ చేతుల్లోకి

0
772

విమానయాన సంస్థ ఎయిరిండియాను టాటా గ్రూప్ ఇవాళ అధికారికంగా సొంతం చేసుకుంది. ఎయిరిండియాను అధికారికంగా టాటా స‌న్స్ గ్రూప్‌కు కేంద్రం అప్పగించింది. గురువారం దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఈ అప్ప‌గింత జ‌రిగింది. రూ.18 వేల కోట్ల బిడ్‌తో ఎయిరిండియాను టాటా స‌న్స్ టేకోవ‌ర్ చేసుకుంది. టాటాస‌న్స్ గ్రూప్ చేతికి ఎయిరిండియా రావ‌డం ఆనందంగా ఉంద‌ని సంస్థ చైర్మ‌న్ ఎన్ చంద్ర‌శేఖ‌ర‌న్ తెలిపారు. ఎయిరిండియా సంస్థ నేటి నుంచి టాటా గ్రూప్ ఆధీనంలో నడుస్తుందని ఎన్.చంద్రశేఖరన్ వెల్లడించారు. ఎయిరిండియా మళ్లీ టాటా గ్రూప్ కి చేరడం పట్ల పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నామని.. ఈ సంస్థను ప్రపంచస్థాయి ఎయిర్ లైనర్ గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని చంద్రశేఖరన్ తెలిపారు. ఎయిరిండియాను అధికారికంగా హస్తగతం చేసుకునే ముందు చంద్రశేఖరన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఎయిరిండియా టేకోవ‌ర్ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ముంబై నుంచి ఢిల్లీకి వ‌చ్చిన టాటా స‌న్స్ చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని కలిశారు. శుక్ర‌వారం నుంచి టాటా స‌న్స్ సంస్థ కింద ఎయిరిండియా కార్య‌క‌లాపాలు జ‌రుగ‌నున్నాయి.

ఎయిరిండియాకు చెందిన 100 శాతం వాటాలను నేడు మెసర్స్ టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు విజయవంతంగా బదలాయించినట్టు కేంద్ర పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే అన్నారు. టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ టాటా గ్రూపు అనుబంధ సంస్థ. 2021లో కేంద్ర ప్రభుత్వం రూ.18 వేల కోట్లకు ఎయిరిండియాను టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు విక్రయించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమాన విభాగంతో పాటు ఎయిరిండియా గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఎయిరిండియా శాట్స్ విభాగాల్లో 50 శాతం వాటాలు టాటా గ్రూప్ వశమయ్యాయి.

టాటా ఎయిర్ లైన్స్ పేరుతో జేఆర్డీ టాటా 1932లో ఓ సంస్థను స్థాపించారు. 1946లో దీని పేరును ఎయిరిండియాగా మార్చారు. 1953లో ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. జేఆర్డీ టాటా ఎయిరిండియా చైర్మన్ గా 1977 వరకు కొనసాగారు. తాజా కొనుగోలుతో ఆరున్నర దశాబ్దాల అనంతరం ఎయిరిండియా మళ్లీ సొంతగూటికి చేరినట్టయింది. దాదాపు 69 సంవత్సరాల సుదీర్ఘ విరామం త‌ర్వాత ఎయిరిండియా తిరిగి టాటాస‌న్స్ చేతుల్లోకి వచ్చింది. సాంకేతిక క్లియ‌రెన్స్‌లు వ‌చ్చిన త‌ర్వాత టాటా ఆధీనంలోని ఎయిరిండియా బోర్డులోకి కొత్త డైరెక్ట‌ర్లు వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఉన్న డైరెక్ట‌ర్ల‌ను కొన‌సాగాల‌ని కోరారు. టాటా గ్రూప్ కు ఇప్పటికే ఎయిర్ ఏషియా, విస్తారా సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఎయిరిండియాకు పూర్వ వైభ‌వం తేవ‌డం టాటా ముందు ఉన్న అతిపెద్ద స‌వాల్‌. ఆన్‌టైం పెర్ఫార్మెన్స్ మెరుగుద‌ల‌పైనే టాటా స‌న్స్ దృష్టి పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి.

ఎయిరిండియా నష్టాల్లో ఉండడంతో కేంద్రం రూ.12,906 కోట్ల రిజర్వ్ ధరతో అమ్మకానికి పెట్టింది. దేశీయ విమాన సంస్థను చేజిక్కించుకునేందుకు స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ నేతృత్వంలోని కన్సార్టియం రూ.15,100 కోట్లు ఆఫర్ చేసింది. టాటా గ్రూప్ అంతకు మరో మూడు వేల కోట్లు అదనంగా ఆఫర్ చేయడంతో కేంద్రం ఎయిర్ ఇండియా పగ్గాలను టాటాలకు అందించింది.