టాటా.. దేశంలో శతాబ్దానికిపైగా చరిత్ర వున్న ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ. గుండుసూది నుంచి ఎరోప్లేన్ వరకు ఈ సంస్థ టచ్ చేయని రంగమంటూ లేదు. ఓవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూనే.. మరోవైపు దేశ పురోగతిలో భాగమైంది. ఎప్పుడు కొత్త ఆలోచనలు, కొత్త కొత్త వ్యాపార ప్రయోగాల్లో ముందుండే టాటా సంస్థ.. దేశంలో మరో సంచనలనానికి తెరతీయబోతోంది. దేశంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల మార్కెట్ ను పెంపొందించే దిశగా టాటా సన్స్ అడుగులు వేస్తోంది. ఇందుకోసం చైనా దిగ్గజ వ్యాపార సంస్థ అలీబాబాతో పాటు, గూగుల్, జోహో సంస్థల సక్సెస్ ఫుల్ మోడళ్లను పరిశీలిస్తోంది. ఆ సంస్థల మాదిరిగానే డిజిటల్ రంగంలో పట్టు పెంచుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వెంగుస్వామి రామస్వామి నేతృత్వంలో టాటా బిజినెస్ హబ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆయన టీసీఎస్ అయాన్ కు గ్లోబల్ హెడ్ గా వున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు టీసీఎస్ అయాన్ క్లౌడ్ ఆధారిత ఐటీ సేవలను అందిస్తోంది.
టాటా సంస్థల్లో నూతన విభాగమైన టాటా బిజినెస్ హబ్ ద్వారా డిజిటల్ సేవల్ని విస్తరించనుంది. టీసీఎస్ అందించే డిజిటల్ టూల్స్ కు ఇది మార్కెటింగ్ సౌకర్యం కల్పించనుంది. అంతేకాదు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుని నిధులను సేకరించనుంది. దేశంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోలేకపోవడమే కాదు.. నిధులు, టెక్నాలజీ కొరతను కూడా ఎదుర్కొంటున్నాయి. అయితే, ఈ సమస్యలకు టాటా బిజినెస్ హబ్ ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆ సంస్థ అధికారులు భరోసా ఇస్తున్నారు.
టాటా బిజినెస్ హబ్ విస్తరణ కోసం ఇప్పటికే సలహాదారులను నియమించిన టాటా యాజమాన్యం.. చిన్న తరహా పరిశ్రమల ఎదుర్కొంటున్న సమస్యలపై పలు కంపెనీల యాజమాన్యాల సలహాలు కూడా సేకరిస్తోంది. అమెరికా ఐటీ కంపెనీ ఇన్టూఐటీ (INTUIT) భారత విభాగానికి మాజీ కంట్రీ మేనేజర్ అయిన ఆదిత్య పూరీ బాత్రాను సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా నియమించింది. టైటాన్ క్యారెట్ లేన్ కు హెచ్.ఆర్. హెడ్ గా పనిచేసిన బిందియా వర్మన్ ను సంస్థ హెచ్.ఆర్. చీఫ్ గా నియమించింది. అంతేకాదు, టాటా బిజినెస్ హబ్ తొలి డిజిటల్ బిజినెస్ మొబైల్ అప్లికేషన్ కోసం.. ఓలా, డెయిలీ హంట్ వంటి డిజిటల్ స్టార్టప్స్ నుంచి నిపుణులను నియమించుకుంది. మొత్తానికి, డిజిటల్ టాటా బిజినెస్ హబ్ ప్రయత్నాలు ఫలిస్తే.. దేశంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల రాత మారుతుందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.