నేపాల్‌లో 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అదృశ్యమైంది. ఆదివారం ఉదయం నేపాల్‌లోని పోఖారా నుంచి జామ్సన్ వెళ్తున్న తారా ఎయిర్‌కు చెందిన విమానానికి 9:55 నిమిషాల సమయంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ముస్తాంగ్ జిల్లాలోని జామ్సన్ గగనతలంలో విమానం చివరిసారిగా కనిపించిందని, ఆ తర్వాత దౌలగిరి పర్వతం వైపు మళ్లిందని, ఆ తర్వాత విమానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని నేపాల్ అధికారులు తెలిపారు. విమానంలో ముగ్గురు సిబ్బందితోపాటు, మరో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారు, ముగ్గురు జపాన్‌కు చెందిన వాళ్లు కూడా ఉన్నారు. గల్లంతైన విమానం కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. రెండు ప్రైవేటు హెలికాప్టర్ల ద్వారా విమానం గల్లంతైన ప్రాంతంలో గాలింపు జరుపుతున్నారు. నేపాల్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటోంది.