కస్టమర్ కు కోపమొచ్చింది..! ఓలా బైక్ తగలబడింది..!!

0
860

ఎన్నో ప్రాంతాల్లో ఎలెక్ట్రిక్ బైక్స్ గురించి ఎన్నో రకాల ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బ్యాటరీలు పేలిపోవడం కూడా జరిగింది. ఎలెక్ట్రిక్ బైక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతోందని.. బైక్ లో సమస్యల గురించి కంపెనీకి చెబుతున్నా పట్టించుకోకపోవడంతో ఆ వ్యక్తికి తన బైక్ మీద కోపం వచ్చి.. ఏకంగా తగులబెట్టేశాడు. వీడియోను తీసి సోషల్ మీడియా సైట్లలో అప్లోడ్ చేసేశాడు.

తమిళనాడులోని ఆంబూర్ కు చెందిన ఓ వ్యక్తి ఓలా ఎలెక్ట్రిక్ కస్టమర్ సర్వీస్‌ తో విసుగెత్తి పోయి ఎలెక్ట్రిక్ బైక్‌ ను తగులబెట్టాడు. అతడు ప్రయాణంలో ఉండగా ఎలెక్ట్రిక్ బైక్ ఆగిపోవడంతో ఆ బైక్ కు అతడు నిప్పంటించాడు. ఆ వ్యక్తిని ఆంబూర్ కు చెందిన ఫిజియోథెరపిస్ట్ పృథ్వీ రాజ్ గోపీనాథన్‌గా గుర్తించారు. ఓలా ఎలెక్ట్రిక్ బైక్‌ను తగలబెట్టిన వీడియోను గోపీనాథన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అతను ఓలా ఎలెక్ట్రిక్, CEO భవిష్ అగర్వాల్, అథర్ ఎనర్జీ, హీరో ఎలెక్ట్రిక్, ఎలాన్ మస్క్ అధికారిక ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేశాడు.

అతడి ట్విట్టర్ టైమ్ లైన్ ను చూస్తే ఎలెక్ట్రిక్ బైక్ ను తీసుకున్నప్పటి నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నట్లు అర్థం అవుతోంది. అతని బైక్ ఛార్జ్ చేస్తే 180 కిమీలకు పైగా నడపగలదని చూపిస్తుంది, అయితే 50-60 కిమీ వెళ్లిన తర్వాత నిలిచిపోతూ ఉంది. ఘటన జరిగిన రోజు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడం కోసం గుడియాతం ఆర్టీఓ వద్దకు వెళ్లాడు. ఆర్‌టీఓ దగ్గర నుంచి తిరిగి వస్తుండగా ఇంటికి వెళ్లేందుకు సరిపడా బ్యాటరీ ఉందని మొదట చూపించింది. కానీ మార్గమధ్యమంలో బైక్ ఆగిపోయింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే మార్గమధ్యంలో బైక్ బ్యాటరీ డెడ్ అవడంతో సపోర్ట్ కోసం ఓలాకు ఫోన్ చేశాడు. అయితే, 3-4 గంటల తర్వాత మాత్రమే సహాయం పంపగలమని కంపెనీ తెలిపింది. ఆ సమాధానంతో విసిగిపోయిన గోపీనాథన్ మరో వ్యక్తికి ఫోన్ చేసి రెండు లీటర్ల పెట్రోల్ తీసుకుని రమ్మని అడిగాడు. బైక్‌ను రోడ్డు పక్కన ఆపి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ వీడియోను తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో అప్‌లోడ్ చేశాడు. గోపీనాథన్ ట్విట్టర్ టైమ్‌లైన్‌ను పరిశీలించగా మూడు నెలల నుండి బైక్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఇన్ని నెలలుగా కంపెనీ అతడి సమస్యను పరిష్కరించలేకపోయింది

గోపీనాథన్ మీడియాతో మాట్లాడుతూ, తాను ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేశాక.. సదరు కంపెనీ ప్రతినిధులు తనకు ఫోన్ చేసి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని కోరిందని తెలిపాడు. బైక్ రీప్లేస్ చేస్తానని కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తనకు సదరు కంపెనీకి ఇకపై ఎలాంటి అనుబంధం లేదని గోపీనాథన్ చెబుతున్నాడు.