ప్రముఖ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఇటీవలే కవలలకు తల్లిదండ్రులయ్యారు. అయితే పెళ్లి జరిగి 4 నెలలు కూడా కాకుండానే నయన్ కవల పిల్లలకు ఎలా జన్మనిచ్చారన్న వాదనలు వినిపించాయి. సరోగసీ (అద్దె గర్భం) ద్వారా నయన్ దంపతులు పిల్లలను కన్నారన్న వాదనలు వినిపించాయి. దీంతో దంపతులకు తమిళనాడు సర్కారు గురువారం షాకిచ్చింది. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. ఈ విషయంపై నయన్ దంపతులు వివరణ ఇవ్వాల్సి ఉందని అన్నారు. తమిళనాడు ప్రభుత్వం తాజాగా నయన్ సరోగసీ వివాదంపై ఏకంగా విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నయన్ సరోగసీపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు సరోగసీ విధానం ద్వారా పిల్లలను కనడంపై నిషేధాన్ని విధించింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే సరోగసీకి వెళ్లేందుకు చట్టం అనుమతిస్తుంది.
అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడంపై 2019లోనే సుప్రీంకోర్టు స్పష్టతను ఇచ్చింది. ఈ పద్ధతి ద్వారా పిల్లలను కనడం నేరమని తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా నయనతార అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సరోగసీ ద్వారా పిల్లలను కన్నట్టయితే నయనతార, విఘ్నేష్ లకు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ సరోగసీ ద్వారా కాదు పిల్లలను దత్తత చేసుకున్నామని చెప్పినా కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.