తమిళనాడులో మొత్తానికి బీజేపీ దిగివచ్చింది. అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా 20 స్థానాలు తీసుకునేందుకు అంగీకరించింది. ఈ మేరకు అన్నాడీంకే పార్టీతో ఒప్పందం చేసుకుంది.
మొదట 60 స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేసినా… బీజేపీ ఆ తర్వాత 40 స్థానాల కోసం పట్టుబట్టింది. అయితే అన్నాడీఎంకే పార్టీ కోఆర్డినేటర్, డిఫ్యూటీ సీఎం పన్నీర్ సెల్వం…అలాగే సీఎం పళనిస్వామి బీజేపీకి అన్ని స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఫలుదపాలుగా చర్చలు కొనసాగాయి. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. సర్వేలన్ని కూడా డీఎంకేకు అనుకూలంగా ఉండటంతో…అమిత్ షా పునరాలోచనలో పడ్డారని… ఏదైనా సరే తెగేవరకు లాగకూడదని… తమిళనాడు నాయకత్వానికి స్పష్టం చేశారని… తన నాగర్ కోయిల్ పర్యటనకు ముందే సీట్ల షేరింగ్ పై ఓ నిర్ణయానికి రావాలని పార్టీ నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది.
దీంతో…బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సీటీ రవి, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్…, అన్నాడీఎంకే నేతలైన సీఎం పళనిస్వామి, డిఫ్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలతో మరో దఫా సమావేశమయ్యారు. బీజేపీ ఇరవై సీట్లకు పరిమితమైతే…, కన్యాకుమారి లోక్ సభ స్థానాన్ని సైతం బీజేపీకే కేటాయిస్తామని ఇద్దరు నేతలు కూడా ఆఫర్ చేశారని…దీంతో బీజేపీ నేతలు కూడా ఇరవై స్థానాల్లో పోటీ చేసేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ మేరకు సీట్ల షేరింగ్ ఒప్పందంపై… బీజేపీ తరపున ఆ పార్టీ ఇన్ చార్జి సీటీ రవి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మురుగన్ సంతకాలు చేశారు. అయితే బీజేపీ పోటీ చేయబోయే స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ సారి తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ రెండు అంకెల స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మురుగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాజకీయాల నుంచి వైదొలగిన ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని.., డీఎంకే అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని.., ఆమె చేసిన ప్రకటనతో అన్నాడీఎంకే ఓట్ల చీలికకు అడ్డుకట్టపడినట్లేనని మురుగన్ అన్నారు.
డీఎంకే అధినేత స్టాలిన్ ముస్లిం మతోన్మాద శక్తులతో చేతులు కలిపి హిందువులకు ద్రోహం చేస్తోందని.., శ్రీలంకలో తమిళుల ఊచకోత జరిగినప్పుడు చోద్యం చూసిందని ఆరోపించారు.
మోదీ ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్ లో తమిళనాడు అభివృద్ధి కోసం రూ. 5 లక్షల కోట్లు కేటాయించిందని…, మదురై -కొల్లం జాతీయ రహదారి, చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి, తూత్తుకుడి పోర్టు అభివృద్ధి, రామనాథపురంలో సముద్ర నాచు కోసం ప్రత్యేక ఆర్థిక మండలి తదితర ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని.. , తమిళ ప్రజలు బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారని..ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మురుగన్ తెలిపారు.
మరోవైపు అమిత్ షా నాగర్ కోయిల్ బహిరంగ సభ తర్వాత… ఏఎంఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కూడా కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం జరిగింది. శశికళ ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించగా…, దినకరన్ పార్టీ మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతోంది. దినకరన్ పార్టీ కారణంగా అన్నాడీఎంకే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు అన్నాడీఎంకే కు… విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. అన్నాడీఎంకే 15 స్థానాలతోపాటు.. ఒక రాజ్యసభ సీటును ఆఫర్ చేసిందని.., అయితే అదనంగా మరో మూడు సీట్లు కావాలని…లేదంటే అన్నాడీఎంకే కూటమి నుంచి తాము తప్పుకుంటామని..డీఎండీకే పార్టీ స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు గతంలో తమ పార్టీ ఏర్పాటు చేసినా… మక్కల్ నల… ప్రజా సంక్షేమ కూటమిని తిరిగి ఏర్పాటు చేసి.. కలిసి వచ్చే చిన్న పార్టీలతో ఎన్నికల్లో పోటీ చేయాలని.. డీఎండీకే నేతలు… ప్రేమలత విజయకాంత్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.