More

    గోవుల గురించి మాట్లాడటం కొంతమందికి నేరం కావచ్చు.. మనకు మాత్రం గోవు తల్లి: ప్రధాని మోదీ

    డిసెంబర్ 23న, వారణాసిలోని కార్ఖియోన్‌లోని యుపి స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఫుడ్ పార్క్‌లో ‘బనాస్ డైరీ సంకుల్’కి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ డెయిరీని రూ.475 కోట్లతో నిర్మించనున్నారు. ఇక్కడ రోజుకు 5 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో అనేక ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

    ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఆవుల ప్రాముఖ్యత గురించి వివరించారు. “ఆవుల గురించి మాట్లాడడం కొంతమందికి నేరం కావచ్చు, కానీ మనం ఆవులను తల్లిగా గౌరవిస్తాము. ఆవు-గేదెలను ఎగతాళి చేసే వ్యక్తులు.. దేశంలోని 8 కోట్ల కుటుంబాల జీవనోపాధి పశువుల ద్వారానే నడుస్తోందనే విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు. పాడి పరిశ్రమను బలోపేతం చేయడంలో భారత ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోందని, అలాంటి ప్రయత్నాల్లో ‘బనాస్ కాశీ సంకుల్’ ఒక భాగమని ఆయన అన్నారు. గత 6-7 ఏళ్లలో భారతదేశంలో పాల ఉత్పత్తి 45% పెరిగిందని చెప్పారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే 22% పాలను ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. “ఈ రోజు ఉత్తర ప్రదేశం దేశంలోనే పాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఉండటమే కాకుండా, పాడి పరిశ్రమ విస్తరణలో కూడా గణనీయంగా ముందుందని నేను సంతోషిస్తున్నాను.” అని మోదీ చెప్పుకొచ్చారు.

    దేశంలోని చిన్న రైతులకు పశుపోషణ భారీ అదనపు ఆదాయ వనరుగా మారుతోందని ప్రధాని అన్నారు. అలాగే పాల ఉత్పత్తులకు విదేశాల్లో విపరీతమైన మార్కెట్ ఉన్నందున రైతులు సంపాదించుకోడానికి మరింత అవకాశాలు ఉన్నాయని అన్నారు. మహిళల ఆర్థిక స్థితిని పెంపొందించడానికి, వారి వ్యవస్థాపకతను మరింత పెంచడానికి పశుపోషణ గొప్ప అవకాశాలను కల్పిస్తోందని ప్రధాన మంత్రి తెలిపారు. బయోగ్యాస్, సేంద్రీయ వ్యవసాయం మరియు సహజ వ్యవసాయానికి పశువులు కూడా పెద్ద ఆధారమని వివరించారు.

    ధృవీకరణ కోసం కామధేను ఆవులతో కూడిన ఇంటిగ్రేటెడ్ లోగోను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఏదైనా పాల ఉత్పత్తిపై లోగో ద్వారా స్వచ్ఛతను గుర్తించడాన్ని సులభతరం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ఇది భారతదేశం నుండి వచ్చే పాల ఉత్పత్తుల విశ్వసనీయతను పెంచడంలో కూడా సహాయపడుతుందని అన్నారు.

    ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రతి పక్షాలను టార్గెట్ చేసిన మోదీ:

    ప్రధానమంత్రి మోదీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రతి పక్షాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలను కులం, మతాల కోణం నుండి చూసే వ్యక్తులు ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. అలాంటి వారు పాఠశాలలు, కళాశాలలు, రోడ్లు, నీరు, పేదలకు ఇళ్లు, గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్లు వంటివి అభివృద్ధిలో భాగంగా పరిగణించడం లేదని ఆయన అన్నారు. “ఇంతకుముందు యూపీ ప్రజలు పొందిన దానికి మరియు ఈ రోజు యూపీ ప్రజలు మా ప్రభుత్వం నుండి పొందుతున్న దానికి మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉంది. యూపీ వారసత్వాన్ని పెంపొందిస్తున్నాం, యూపీని కూడా అభివృద్ధి చేస్తున్నాం’’ అని ప్రధాని మోదీ అన్నారు.

    వారసత్వ రాజకీయాలు, మాఫియా, ఆస్తుల ఆక్రమణలపై విపక్షాలపై మోదీ విమర్శలు గుప్పిస్తూ “వారి సిలబస్‌లో సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ లేవు. వారి బాడీ లాంగ్వేజ్, ఆలోచనలు ఏమిటో మీ అందరికీ తెలుసు – ‘మాఫియావాద్’, ‘పరివార్వాద్’, ‘అక్రమ ఆస్తి కూడబెట్టడం’ మాత్రమే వాళ్లకు కావాలి. వారికి పూర్వాంచల్ అభివృద్ధి, కాశీ విశ్వనాథ్ ధామ్‌తో కూడా సమస్యలు ఉన్నాయని మోదీ అన్నారు.

    Trending Stories

    Related Stories