More

    ఆఫ్ఘనిస్థాన్ లో మళ్లీ అలాంటి పరిస్థితులే..!

    ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా సహా నాటో దళాలు పూర్తిగా వైదొలుగుతుండడంతో తాలిబాన్లు తమ బలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో 85 శాతం భూభాగం ఇప్పుడు తమ అధీనంలోనే ఉందని తాలిబాన్లు తాజాగా ఓ ప్రకటన చేశారు. ఇరాన్ తో కీలక సరిహద్దు ప్రాంతంపైనా పట్టు సాధించామని.. సరిహద్దు పట్టణం ఇస్లాం ఖలాను చేజిక్కించుకున్నామని తాలిబాన్లు తమ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇస్లాం ఖలా పట్టణంపై తాలిబాన్లు చేసిన ప్రకటనను ఖండించాయి. ఈ పట్టణం వద్ద ఇంకా పోరాటం జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. ఆఫ్ఘన్ రక్షణ బలగాలు, సరిహద్దు భద్రతా దళాలు ప్రస్తుతం ఈ పట్టణం వద్దే మోహరించి, తాలిబాన్లను తరిమికొట్టేందుకు పోరాడుతున్నాయని ఆఫ్ఘనిస్థాన్ హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి తారిఖ్ అరియన్ వెల్లడించారు. 20 ఏళ్ల కిందట ఆఫ్ఘనిస్థాన్ లో ప్రారంభమైన తమ సైనిక కార్యాచరణ ఆగస్టు 31తో పూర్తిగా ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. తాము ఆశించిన లక్ష్యాలను చేరుకున్నట్టు భావిస్తున్నామని తెలిపారు.

    అమెరికా, నాటో సేనలు వెనక్కి వెళ్లిన 6 నెలల్లో కాబూల్‌ తాలిబన్ల వశమవుతుందని ఇప్పటికే అమెరికా నిఘా విభాగం హెచ్చరించింది. వారిని ఎదుర్కోగల సత్తా ఇప్పుడున్న అష్రాఫ్‌ ఘనీ ప్రభుత్వానికి లేకపోవడంతో ఆఫ్ఘనిస్థాన్ భవితపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్లో సైనిక నష్టాన్ని తప్పించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తమ బలగాలను ఉపసంహరించాలని భావిస్తూ ఉన్నారు. అమెరికాలో సెప్టెంబరు 11 ఉగ్ర దాడులు జరిగి 20 ఏళ్లు పూర్తికానుండడంతో గత మే ఒకటో తేదీ నుంచి బలగాల ఉపసంహరణ మొదలుపెట్టారు. సెప్టెంబరు 11నాటికి తమ దేశ సైనికులను స్వదేశానికి వచ్చేయాలని తెలిపారు. అమెరికా, నాటో బలగాలపై దాడులు చేయకూడదని తాలిబాన్లతో గత ఏడాది ఫిబ్రవరిలోనే నాటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. నాటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ మిలిటరీ, పోలీసు బలగాలపై మాత్రమే తాలిబాన్లు దాడులు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ బలగాలను తాలిబాన్లు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వీలైనంత ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నారు.

    Trending Stories

    Related Stories